Saturday, May 18, 2024

పోలింగ్ జరుగుతుండగానే ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ కార్యకర్త

spot_img

ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నావని, నీ అంతు చూస్తానని బీజేపీ నాయకులు బెదిరించడంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బరిలో ఉన్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరిగింది. భీమ్‌గల్‌ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు తునిగండ్ల రాజాగౌడ్‌ (45) బుధవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఈర్ల లక్ష్మీప్రసన్న, నర్సు, మధు, మహేందర్‌ అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు రాజాగౌడ్‌పై ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నావని ఆరోపణలు చేయడంతోపాటు చంపుతామని బెదిరించారు.

Read Also: ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

దాంతో పోలింగ్ రోజు గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజాగౌడ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించినా లభించలేదు. గ్రామ శివారులోని దేవి ఆలయం వద్ద రాజాగౌడ్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు బీజేపీ నాయకుల ఇంటి ముందు మృతదేహంతో శుక్రవారం ధర్నాకు దిగారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశా రు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజాగౌడ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles