Monday, May 20, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతోంది.. లాకప్‌డెత్ ఘటనపై బాల్క సుమన్ వార్నింగ్

spot_img

నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై సీనియర్ అధికారితో సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. సూర్య నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

సూర్య నాయక్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతోందన్నారు. రాజకీయ కక్షలకు పోలీసులు పావులుగా మారుతున్నారని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని దాసోజు శ్రవణ్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. పదేళ్ల నుండి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో మేము ఎక్కడా కవ్వింపు చర్యలకు పాల్పడలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు బాల్క సుమన్. ఇలాంటి సంఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర డీజే సాంగ్స్, బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.

నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ స్టేషన్ లో నిందితుడి మరణం విదాస్పదంగా మారింది. ఎస్ఐ విపరీతంగా కొట్టడం వల్లనే మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఎస్ఐ సతీశ్ రెడ్డి తలదూర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నేత సూచనతో సూర్య నాయక్ ను పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సతీష్ రెడ్డి చితకబాదారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో అస్వస్థతకు గురైన నూర్య నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సూర్య నాయక్ మృతికి కారణమైన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మృతుడి బంధువులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.

Latest News

More Articles