Friday, May 10, 2024

బంగారు పళ్లెంలో ఆర్థిక వనరులు అప్పగించాం. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి

spot_img

హైదరాబాద్: బంగారు పళ్లెంలో ఆర్థిక వనరులు అప్పగించాం. పదేళ్ల కాలంలో ఎంతో శ్రమించి సీఎం కేసిఆర్ సాధించిన రాష్ట్ర ఆర్థిక వనరులను ( SOTR ) కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలనను అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల ఆర్థిక వనరుల కన్నా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. అభివృద్ధి సాధించాయి అని చెప్పుకునే గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ వంటి అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక వనరుల సాధనలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో హర్యానా రాష్ట్రం ఉండగా తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కాంగ్రెస్ నాయకులు పదేపదే చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.

దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్.బి.ఐ విశ్లేషణను విడుదల చేసింది. ఆర్బిఐ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని ( SOTR ) సమకూర్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 84.2% తో రెండో స్థానంలో నిలిచింది. ఒక్క వ్యవసాయ రంగంలోనే 400% వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. దీంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. వరి, మొక్కజొన్న, పత్తి, ఇతర పప్పు దినుసులు భారీ ఎత్తున పండించడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడానికి దోహదపడింది. పుష్కలంగా విద్యుత్తు, నీటి సౌకర్యం ఉండడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు.

నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో మూడు షిఫ్టులలో పరిశ్రమలు పనిచేయడం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటి రంగంలో పరిశ్రమలో ఎంతో పురోగతిని సాధించాం. తద్వారా రాష్ట్ర ఆదాయం బాగా పెరగడానికి కారణమయ్యాయి. 2014 లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా, తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 26,000 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Latest News

More Articles