Friday, May 17, 2024

ఏపీ స్కాంలో చంద్రబాబే కీలక పాత్రధారి.. సీఐడీ రిపోర్టులో కీలక అభియోగాలు

spot_img

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కీలక పాత్రధారి అని సీఐడీ పేర్కొంది. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఏపీ సీఐడీ, సిట్ అధికారులు 28 పేజీల రిమాండ్‌ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సిట్‌ సమర్పించారు. ఈ రిమాండ్‌ రిపోర్టులో చంద్రబాబు మీద సిట్ సంచలన అభియోగాలు చేసింది.

రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు
చంద్రబాబు నేరపూరితకుట్రకు పాల్పడ్డారు. ప్రజా ప్రతినిధిగా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. చట్టాన్ని పట్టించుకోకుండా.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజాధనాన్నిరక్షించాల్సిన వారే మోసాలకు పాల్పడ్డారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చారు. మోసాలకు పాల్పడేందుకు ఫోర్డరీ కూడా చేశారు. తప్పుడు డాక్యుమెంట్లను నిజమైన వాటిగా చూపించడమే కాకుండా.. నేరానికి ప్రేరేపించారు. ఈ విధంగా తన అధికార హోదాను దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా సహకారం అందించారు.

డిసెంబర్‌ 9, 2021న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంపై ఫిర్యాదు అందింది. గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణప్రసాద్‌ మరియు ఇతరులు తమ అధికార హోదాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు అందింది. కుట్రపూరితంగా, ఉద్దేశ పూర్వకంగానే స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు జీవో వచ్చింది. జూన్‌ 30,2015న జీవో జారీ అయ్యింది. అప్పటి సీమెన్స్‌ ఇండియా ఎండీ సౌమ్యాద్రి బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ ఖాన్వెల్కర్‌తో కలిసి రూ. 371 కోట్ల మేర దుర్వినియోగం చేశారు. దీని నుంచి చంద్రబాబు లబ్ధి పొందారు. ఏపీఎస్‌ఎస్‌డీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం తన వాటాగా ఈ డబ్బు చెల్లించింది. ఇందులో రూ.279 కోట్లను వివిధ షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారు. పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్‌, అలైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, పాట్రిక్‌ ఇన్ఫో సర్వీసెస్‌ లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఇన్‌వెబ్‌ సర్వీసెస్, టాలెండ్‌ ఎడ్జ్‌ తదితర షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారు. ఒప్పందంలో పేర్కొన్నట్టుగా ఈ కంపెనీల నుంచి ఎలాంటి సేవలు కాని, కార్యక్రమాలు కాని అందలేదు. ఈ షెల్‌ కంపెనీల నుంచి మరికొన్ని చిన్నాచితకా కంపెనీల ద్వారా రూ.279 కోట్లను వివిధ మార్గాల ద్వారా మళ్లించారు. తద్వారా ఖజానాకు తీవ్ర నష్టంచేకూర్చారు.

జూన్‌ 30, 2015న జీవో జారీ నుంచి ఈవ్యవహారం నడిచింది. పుణెలో 2017-18 మధ్య జీఎస్టీ అధికారులు చేసిన సోదాల్లో నిధుల దుర్వినియోగం బయటపడింది. అక్కడ జరిపిన సోదాల్లో రూ.241 కోట్లు దుర్వినియోగం అయినట్టుగా వారు తేల్చారు. తప్పుడు ఇన్వాయిస్‌లు ఇచ్చి భారీ ఎత్తున ప్రజాధనాన్ని మళ్లించారని కనిపెట్టారు. ఎలాంటి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఇతర పరికరాలు, సేవలు అందించలేదని నిగ్గు తేల్చారు. డబ్బును బ్యాంకుల ఖాతాలనుంచి డ్రా చేసి హవాలా మార్గాల ద్వారా మళ్లించారు. రూ.371 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి టెక్నాలజీ కంపెనీలకు నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించారు. ఇంత డబ్బు ఖర్చుచేస్తున్నప్పటికీ ఎలాంటి టెండర్లు నిర్వహించలేదు. ఈ మేరకు చంద్రబాబు ఎలాంటి నియమాలను పట్టించుకోలేదు. డబ్బు విడుదలకు సంబంధించి చంద్రబాబు జనరల్ ఫైనాన్స్‌ రూల్స్‌ను పట్టించుకోలేదు. సెంట్రల్ విజిలెన్స్‌ కమిషన్‌ నియమాలను పట్టించుకోలేదు. అన్నిరకాల నిబంధనలను చంద్రబాబు తుంగలో తొక్కారు. తప్పుడు రశీదులు సృష్టించి, నకిలీ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారు. ఆ కంపెనీలు స్వతహాగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడంలేదు. చంద్రబాబు పూర్తిగా తప్పుడు మార్గంలో వెళ్లారు. కేసు విచారణలో హైకోర్టు మూలాల్లోకి వెళ్లింది. మా విచారణలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీచేసిన విషయం బయటపడింది. ఆగస్టు4, 2023న హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు చెందిన ఐ.ఆర్‌.ఎస్‌ అధికారి దొండపాటి వెంకట హరీష్‌.. చంద్రబాబుకు నోటీసు జారీచేశారు. 2017-18 మధ్య లంచాలకోసం చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏంటో బయటపడింది. సబ్‌కాంట్రాక్టర్లు పనులు చేసినట్టుగా నకిలీ రశీదులు సృష్టించి ఆమేరకు డబ్బును చంద్రబాబు సూచించిన వ్యక్తికి చేరవేశారు. ఐటీ నోటీసుల గురించి తెలియగానే మరో కీలక ముద్దాయి మనోజ్‌ వాసుదేవ్‌, చంద్రబాబు అప్పటి పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ దేశం విడిచి పారిపోయారు. ముంబై నుంచి ఎమిరేట్స్‌కు సెప్టెంబరు ఐదో తేదీ రాత్రి 7:10గంటలకు మనోజ్‌ పారిపోయారు. సెప్టెంబరు ఆరోతేదీన పెండ్యూల శ్రీనివాస్‌ అమెరికాకు పారిపోయాడు’ అని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.

Latest News

More Articles