Saturday, May 18, 2024

తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఉద్యమస్పూర్తిని కించపరచొద్దు..!

spot_img

రాష్ట్రం ఏర్పడి పదేళ్లయిన సందర్భంగా ప్రజలు సంబరాలు చేసుకుంటే చూసి ఓర్వలేని సన్నాసి బండి సంజయ్. నీకు తెలంగాణ అంటే ఇంత ద్వేషమెందుకు.? సంబరాలకు అడ్డుపడుతున్న నువ్వు అసలు తెలంగాణ బిడ్డవేనా.? ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని సన్నాసులు మీరు. ఉద్యమం చేస్తే తెలిసేది నీకు. ఇవాళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామో.. ఆనాడు తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో, రాష్ట్రం సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డామో తెలిస్తే.. ఇవాళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామో తెలిసేది అని బండి సంజయ్ పై ఒక రేంజిలో ఫైర్ అయ్యారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి.

మీడియాతో సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీ డబుల్ ఇంజిన్ అనేది అతిపెద్ద ఫెయిల్యూర్. కానీ మాది అభివృద్ధి మోడల్. ప్రతీ ఏటా కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ అభివృద్ధికి అవార్డులతో పట్టం కడుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం 20 అవార్డులు ఇస్తే అందులో 19 అవార్డులు తెలంగాణ పల్లెలకే వచ్చాయి. పల్లెల అభివృద్ధి విభాగంలో ఇటీవల 46 అవార్డులు ప్రకటిస్తే అందులో 13 గ్రామాలు తెలంగాణవే. 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని మీ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఒక్క తెలంగాణకే ఇన్ని అవార్డులు వస్తే.. మీ డబుల్ ఇంజిన్ పాలన ఉన్న 10 రాష్ట్రాలకు ఎన్ని వచ్చాయి.? 20 బెస్ట్ మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తే అందులో 10 మున్సిపాలిటీలు తెలంగాణవే. సగం అవార్డులు ఒక్క తెలంగాణకే వచ్చాయి.

రెండు దశాబ్దాలకు పైగా మీరు అధికారంలో ఉన్న గుజరాత్ లోని గ్రామాలకు వచ్చిన అవార్డులెన్ని.? మీ డబుల్ ఇంజిన్ పాలనే మంచిదైతే అవార్డులు ఎందుకు రాలేదు.? కేవలం ఏడేళ్లలోనే తెలంగాణ ప్రపంచస్థాయిలో నంబర్ వన్ గా ఎదిగింది. ప్రపంచంలోనే ఒక్క హైదరాబాద్ లో పచ్చదనం పెరిగింది. దేశంలో అటవీ విస్తీర్ణం పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే భూగర్భ జలాలు పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రూ.3,17,115 తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది.

ఇక ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి ప్రత్యక్ష నిదర్శనాలు. అందుకే ఈ దశాబ్ది ఉత్సవాలు. ప్రజలు జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో నువ్ భాగస్వామిగా ఉన్నావో లేదో తేల్చుకో. బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇల్లు, రైతులకు పంటల బీమా ఇస్తామంటున్న సంజయ్.. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలి.? 9 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్నది మీ పార్టీనే కదా. ఓ పాలసీ రూపొందించి అన్ని రాష్ట్రాలతో అక్కడి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉచిత విద్య, వైద్యం, పేదలకు ఇండ్లు ఇవ్వండి. రైతులకు పెట్టుబడి సాయం చేయండి, పంటలకు బీమా చేయండి. అలాగే దేశంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు మొదట భర్తీ చేయండి. అత్తెసరు ఉద్యోగాలకు అపాయిట్మెంట్ లెటర్లు ఇవ్వడం కాదు.. ఆ ఉద్యోగాలు భర్తీ చేయమని వెళ్లి మీ మోడీని అడుగు. అంతేగానీ.. పదేళ్ల అభివృద్ధి పండగ చేసుకుంటున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, ఉద్యమస్పూర్తిని దెబ్బతీసేలా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.

Latest News

More Articles