Sunday, June 30, 2024

రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. సమ్మర్‎లో ఉండాల్సిన డిమాండ్ ఆగష్టులోనే..

spot_img

రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ రోజు అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదయింది. దాంతో సమ్మర్‎లో వచ్చే విద్యుత్ డిమాండ్ వానాకాలంలోనే నమోదు అయింది. గత సంవత్సరం ఈరోజు 11,198 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. ఈ సంవత్సరం 14,747 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. అయితే ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ఈ డిమాండ్ అధికం కావడం గమనార్హం.

అయితే వర్షాలు తగ్గడం, సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాటు వరి సాగు విస్తీర్ణం పెరగడం, ఎండలు ఎక్కువగా ఉండడం వల్లే విద్యుత్ డిమాండ్ పెరిగిందని విద్యుత్ అధికారులు అంటున్నారు. ఏటేటా సాగు విస్తీర్ణం పెరగడమే విద్యుత్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే వ్యవసాయ రంగం కోసం అత్యధికంగా విద్యుత్ వాడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనంటున్నారు. మొత్తం విద్యుత్ డిమాండ్‎లో 35 శాతం నుండి 40 శాతం వ్యవసాయం కోసమే వాడుతున్నట్లు తెలిపారు. అందువల్లే ఏప్రిల్, మే నెలల్లో నమోదు అయ్యే విద్యుత్ డిమాండ్ ఆగస్టు నెలలో నమోదు అయ్యిందంటున్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ఉండడంతో పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేశామని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. కానీ ఈ సంవత్సరం కృష్ణానదిలో నీరు లేక జల విద్యుత్ ఉత్పత్తి లేకున్నా రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. ఎంత విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరా చేస్తామని ప్రభాకర్ రావు అంటున్నారు.

Latest News

More Articles