Monday, May 20, 2024

ఏపీలో తొలిసారి డబుల్ డెక్కర్ ఈ-బస్సులు.. ఎక్కడంటే ?

spot_img

ఇప్పటికే హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డబుల్ డెక్కర్ ఈ-బస్సులు ఏపీలోనూ ల్యాండ్ అయ్యాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో తొలిసారి డబుల్ డెక్కర్ ఈ-బస్సులు పరుగులు తీయనున్నాయి.  ఈ-బస్సులను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో భూమన డబుల్ డెక్కర్ బస్సుకు పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ బస్సులో తిరుపతి నగరానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రయాణించారు.

ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత మాట్లాడారు. స్థానికులకు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఏపీలో తొలిసారిగా ఓ నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ బస్సులో ప్రయాణించే వారికి సరికొత్త అనుభూతి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఇవి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు. వీటిని తిరుపతిలోని నాలుగు ప్రధాన రూట్లలో నడపనున్నారు. ప్రస్తుతం ఒక బస్సును నడిపి, మలివిడతలో మిగతా డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.

Latest News

More Articles