Saturday, May 18, 2024

నీళ్లు ఉన్నా ప్రభుత్వ వైఫల్యంతో ఇవ్వడం లేదు

spot_img

ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదు. కేసీఆర్ కాలు పెట్టగానే కాంగ్రెస్ వాళ్లు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు?. మంత్రులు, మీ బృందం వెళ్లి వాస్తవాలు ఏమిటో చెప్పండి అని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. ఎండిన పొలాలు ఎక్కడున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ, ప్రశ్నించడమే పాపం అన్నట్లు వ్యవహరించడం తగదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు.. లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి. 50, వంద సీట్లు కూడా కాంగ్రెస్ కు రావని అంటున్నారు అని అన్నారు.

నీళ్ల పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా, ప్రాజెక్టుల వారీగా కనీసం సమీక్ష నిర్వహించలేదన్నారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు.ఇక ఎప్పటికీ రాదు అని అంటామా? రెండు సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి రాలేదా? అని అన్నారు. గత అసెంబ్లీ చేసిన తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలన్నారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని పొరుగు రాష్ట్రాల వారు అడగలేదా? నిందలు కాదు, రైతుల కష్టాలపై దృష్టి పెట్టండని కోరారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి హామీలు అమలు అయ్యాయో… లేదో తెలుసుకోండని సూచించారు. అధికారులను భయపెట్టడం మానుకోవాలన్నారు. వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు శ్రీనివాస్ గౌడ్. నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యంతో ఇవ్వడం లేదన్నారు. పంట బతికించుకునేందుకు రైతులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రైతులైతే వాళ్ల కష్టాలు ఏమిటో తెలుస్తాయన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య రైతులు నలిగిపోరాదన్నారు శ్రీనివాస్ గౌడ్.

ఇది కూడా చదవండి: భార్యాపిల్లలను హతమార్చి.. మూడు రాత్రులు శవాలతోనే..

Latest News

More Articles