Monday, May 20, 2024

దేశాన్ని ఆకర్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పాలన

spot_img

వనపర్తి జిల్లా: నూతన సంవత్సరం రోజున వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 238 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు రూ.67 లక్షల విలువైన చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తమది సంక్షేమ ప్రభుత్వం అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. ధరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందుతుందన్నారు. పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు.

‘‘దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రభుత్వంలో మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పాలన దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తున్నది. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నది.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి పెంచే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు తెగనమ్మి బీజేపీ ప్రజలకు ఉపాధి దూరం చేస్తున్నది. అత్యధిక శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. వ్యవసాయ రంగం, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.’’ అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Latest News

More Articles