Friday, May 17, 2024

బీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తే కాల్చి చంపుతాం.. దంపతులకు బెదిరింపు లేఖలు

spot_img

‘బీఆర్‌ఎస్‌ పార్టీకి పనిచేయటం మానుకోండి. లేదంటే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలపై స్థానిక నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ మేరకు బీడ్‌ జిల్లా గెవరాయి తాలూకాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలైన బాలా సాహెబ్‌ మస్కే, మయూరి దంపతులకు లేఖలు వచ్చాయి. ఈ దంపతులిద్దరూ సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్‌ అమలు కోసం ఊరూరా తిరుగుతున్నారు. గ్రామ, తాలూకా, డివిజన్‌ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీడ్‌ జిల్లాలో ఎన్సీపీ నేత ధనుంజయ్‌ముండేకు బాలాసాహెబ్‌ మస్కే నమ్మినబంటుగా ఉంటూ జిల్లా వ్యాప్తంగా పేరున్న నేతగా ఎదిగారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాల్లో ధనుంజయ్‌ ముండే అజిత్‌పవార్‌ వర్గంలో చేరిపోయారు. దీనిని వ్యతిరేకించిన మస్కే బీఆర్‌ఎస్‌లో చేరారు. మస్కే బీఆర్‌ఎస్‌లో చేరటాన్ని జీర్ణించుకోలేని ధనుంజయ్‌ వర్గమో లేదా అజిత్‌పవార్‌ వర్గమో ఈ బెదిరింపులకు పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపు లేఖలపై వారు స్థానిక గెవరాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో ఇంటింటికీ పరిచయం కావడం, తెలంగాణ మాడల్‌ ప్రజలందరికీ తెలిసిపోవడంతో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నాయని బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొంగ్డే పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలు బెదిరిస్తున్నారంటే బీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లోకి వెళ్లిందని స్పష్టం అవుతున్నదని అన్నారు. పార్టీని, క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదం చెప్పారు.

కాగా.. ఈ బెదిరింపులపై బీఆర్‌ఎస్‌ ఘాటుగా స్పందించింది. ఊరు.. పేరు లేకుండా వచ్చిన లేఖలకు బెదరబోమని తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో ఇల్లిల్లూ ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అని నినదిస్తుండటంతో అవతలి పార్టీలకు మింగుడుపడక బెదిరింపులకు పాల్పడుతున్నాయని స్పష్టం చేసింది. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్‌ విసిరింది. భయపెడితే బెదరడానికి తామేమీ ఊరుపేరులేనివాళ్లం కాదని, తమ వెనుక ప్రజలు ఉన్నారని, రక్షణ కవచంగా బీఆర్‌ఎస్‌ నిలుస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

Latest News

More Articles