Saturday, May 18, 2024

గర్జించిన గిల్.. ముంబైని ఓడించి ఫైనల్‎కి చేరిన గుజరాత్

spot_img

తప్పక గెలవాల్సిన మ్యాచ్‎లో గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ముంబైతో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‎లో గెలిచి ఫైనల్‎కి చేరుకుంది. దాంతో వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్ పోరులో నిలిచింది. ఈ నెల 28న చెన్నై సూపర్‌కింగ్స్‌‎తో ఫైనల్‌ మ్యాచ్‌‎లో తలపడి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన ముంబై.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కిక్కిరిసిన అహ్మదాబాద్ స్టేడియంలో ఆట మొదలు నుంచే టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెచ్చిపోయాడు. 60 బంతుల్లో 7ఫోర్లు, 10 సిక్స్‌లతో 129 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఎడపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 233/3 భారీ స్కోరు చేసింది. కాగా.. ఈ సీజన్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆకాశ్‌ మద్వాల్‌, పీయూశ్‌ చావ్లా ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్‌ 38 బంతుల్లో 61 పరుగులు, తిలక్‌వర్మ 14 బంతుల్లో 43 పరుగులు చేయగా.. మిగతా వారెవరూ అంతగా రాణించలేకపోయారు. మోహిత్‌శర్మ 10 పరుగులిచ్చి 5 వికెట్లతో చెలరేగగా, షమీ 2 వికెట్లు, రషీద్‌ఖాన్‌ 2 వికెట్ల తీసుకొని ముంబైని మట్టికరిపించారు.

Latest News

More Articles