Friday, May 3, 2024

ఐపీఎల్‎లో ఏడు కోట్లు పలికిన కొత్త కుర్రాడు..

spot_img

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మినీ వేలంలో జార్ఖండ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్ర జాక్‌పాట్‌ కొట్టాడు. వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో అడుగుపెట్టిన కుశాగ్ర.. ఎవరూ ఊహించని విధంగా రూ. 7.2 కోట్ల ధర దక్కించుకోవడం గమనార్హం. దేశవాళీ క్రికెట్‌లో కూడా పెద్దగా వినిపించని కుశాగ్ర పేరు.. వేలంతో మార్మోగిపోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడికి భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. కుశాగ్ర కోసం ఐపీఎల్‌ దిగ్గజ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌లు పోటీపడటం విశేషం. ఇంతకీ ఎవరీ కుశాగ్ర…?

ధోనీ స్వరాష్ట్రం జార్ఖండ్‌కు చెందినవాడే

భారత క్రికెట్‌ జట్టుకు రెండు వరల్డ్‌ కప్‌లు, ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ స్వరాష్ట్రం జార్ఖండ్‌కు చెందినవాడే కుశాగ్ర. రాష్ట్రంలోని బొకారో వాసి అయిన అతడు.. 2004 అక్టోబర్‌ 23న జన్మించాడు. ధోనీని ఆరాధించే కుశాగ్ర.. అతడి మాదిరిగానే వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కావడం గమనార్హం. 19 ఏండ్ల ఈ కుర్రాడు రెండేండ్ల క్రితమే దేశవాళీ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తోపు రికార్డు..

2021లో లిస్ట్‌ ఏ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కుశాగ్ర.. 2022లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన కుశాగ్ర.. 39.45 సగటుతో 868 పరుగులు చేశాడు. గతేడాది రంజీ సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా 269 బంతుల్లో 266 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 37 బౌండరీలు, రెండు సిక్సర్లున్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కులలో అతడు ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 2022-23 విజయ్‌ హజారే ట్రోఫీతో పాటు దేవ్‌దార్‌ ట్రోఫీలో కూడా రాణించాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో 275 పరుగులు చేసిన అతడు.. దేవ్‌దార్‌ ట్రోఫీలో 227 రన్స్‌తో రాణించాడు. ఈ యువ వికెట్ కీపర్‌ బ్యాటర్‌ 2020లో అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Latest News

More Articles