Monday, May 20, 2024

అది ముసాయిదా మాస్ట‌ర్ ప్లాన్ మాత్ర‌మే.. రైతుల భూములు ఎక్క‌డికి పోవు

spot_img

కామారెడ్డి : ప్ర‌స్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్ట‌ర్ ప్లాన్ మాత్ర‌మే అని, ముసాయిదాలో మార్పులు, చేర్పులు జ‌రుగుతాయ‌ని కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ జితేశ్ పాటిల్ అన్నారు. ఇవాళ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి కొత్త మాస్ట‌ర్ ప్లాన్ పై ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆయన వివరణ ఇచ్చారు.

మాస్ట‌ర్ ప్లాన్ పై రైతుల అభ్య‌ర్థ‌న‌ల‌ను అన్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌న్నారు. 60 రోజుల్లో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1026 అభ్యంత‌రాలు వ‌చ్చాయన్నారు.

రైతుల‌కు ఇంకా ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జ‌న‌వ‌రి 11న సాయంత్రం 5 గంట‌ల‌ వ‌ర‌కు అభిప్రాయాలు తెలిపే అవకాశం ఉందని కామారెడ్డి క‌లెక్ట‌ర్ తెలిపారు.

భూములు పోతాయ‌ని రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు కలెక్ట‌ర్. భూములు పోతాయ‌న్న‌ది త‌ప్పుడు స‌మాచార‌మే అని స్ప‌ష్టం చేశారు.

ప‌ట్ట‌ణం ఎలా విస్త‌రిస్తుందో.. దాని ప్ర‌కార‌మే మాస్ట‌ర్ ప్లాన్ ఉంటుందని, ముసాయిదా ఫైన‌ల్ కావాడానికి చాలా ద‌శ‌లు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ మొద‌టి ద‌శ‌లోనే ఉందన్నారు.

మాస్టర్ ప్లాన్ రైతుల భూములు ఎక్క‌డికి పోవని, రైతుల భూమి వారి పేరు మీద‌నే ఉంటుంద‌న్నారు. తమ దృష్టికి వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిశీలించి, నివృత్తి చేస్తున్నామ‌ని కలెక్టర్ అన్నారు. ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్ అంటే భూముల సేక‌ర‌ణ కాదు అని క‌లెక్ట‌ర్ జితేశ్ పాటిల్ స్ప‌ష్టం చేశారు.

Latest News

More Articles