Saturday, May 18, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయం

spot_img

కరీంనగర్ జిల్లా : బడుగు బలహీనర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని  మంత్రి గంగుల ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్దత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వలతో కూడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయం అని కొనియాడారు. బాపూజీ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాల్లో పదవులు వస్తె చాలు అనుకునే పరిస్థితి నుండి తనకు తెలంగాణ తప్ప ఏమీ వద్దని మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన బాపూజీ తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూడక పోవడం బాధాకరం అని అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అయినా తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఉమ్మడి ఆస్తి అని, బావి తరాలకు ఆయన చరిత్ర తెలిసేలా గ్రామాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెనుకబడిన కులాలు ముందుకెళ్లాలని చివరివరకు కోరుకున్న వ్యక్తి బాపూజీ అని, అంబేడ్కర్ లాగే బాపూజీని కూడా మనం స్మరించుకోవాలి అని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోక పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా అధ్వాన్నంగా ఉండేవని, స్వరాష్ట్రంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసి పల్లెల రూపురేఖలు మారిపోయయని అన్నారు. ఆనాడు పల్లెల పరిస్థితి నేటి పల్లెల పరిస్థితిలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని అన్నారు.

ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలని ఇబ్బందులు పెట్టిన పార్టీలు నేడు మళ్ళీ ఎన్నికల వేళ మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని, మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మాయమయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఒక్క ఓటు విలువ ఐదేళ్ల పాలనకు నిదర్శనం అని, ఒక్క ఓటు బావి తరాలను నిర్ణయిస్తుందని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయని, ప్రజలకు పని చేయాలనే ఆలోచన కేవలం కెసిఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. తనకు మరోసారి ఓటువెస్తే మరింత గొప్పగా పనిచేస్తానని..ప్రజలకు సేవచేసి రక్షించే బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు.

Latest News

More Articles