Sunday, May 19, 2024

రైతులను ముంచడంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే

spot_img

మోటర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే అదనపు డబ్బులు రాలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కుండ బద్దలు కొట్టారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఇంత కాలం బీజేపీ నాయకులు అబద్దాలతో దభాయించారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ఈ దేశంలో రైతు పక్షపాతి ఒకే ఒక్కడు కేసీఆర్. కాంగ్రెస్ బండారం కూడా నిర్మల బయట పెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మీటర్లు పెట్టారని నిర్మల చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీ సర్కారు ఉండి ఉంటే రైతుల మోటర్లకు మీటర్లు, రైతులకు బిల్లులు వచ్చేవి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి కాంగ్రెస్ రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి అదనపు డబ్బులు వసూల్ చేస్తున్నారు. తప్పిపోయి పొరపాటున ఇక్కడ కాంగ్రెస్ వస్తే రైతులకు మీటర్లు తప్పవు. గెలిచిన కర్ణాటకలో 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతులకు శత్రువులు. యూపీఏ హయాంలో స్వామినాథన్ కమిటీ రైతుల బాగు కోసం రిపోర్ట్ ఇచ్చింది. యూపీఏ ఆ కమిటీని తుంగలో తొక్కితే, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని బీజేపీ చెప్పింది. తొమ్మిదేళ్లుగా ఆ ఊసే లేదు.. ఆ రెండు జాతీయ పార్టీలు దొందూ దొందే. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వంటి రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారు. మీటర్లు పెట్టని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. రైతులను ముంచడంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే బోరు బావులకు మీటర్లు పెట్టాలని ఒప్పుకున్నట్లే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారని నిరూపించడానికి సిద్దంగా ఉన్నాను, ఎవరొస్తారో రావాలి. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏటా 9 వేల కోట్లు తెచ్చుకుంటుంది.

Read Also: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం 3.17 లక్షలు. పదేండ్ల క్రితం పదో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు అగ్ర స్థానంలో ఉంది. దేశం తలసరి ఆదాయం లక్షా 72 వేలు ఉంది.. అంటే ఎవరి పాలన బాగుందో తెలిసిపోతుంది. ఢిల్లీలో తెలంగాణ శభాష్ అంటారు.. గల్లిలోకి వచ్చి తిడతారు. కేంద్రం తొమ్మిదేళ్లలో 9 లక్షల కొట్లు అప్పు చేసింది. నెలకు లక్ష కోట్ల అప్పులు కేంద్రం చేస్తోంది. రిజర్వ్ బాంక్ విడుదల చేసిన లెక్కల ప్రకారం అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాలలో కింది నుంచి అరో స్థానంలో తెలంగాణ ఉంది. బీజేపీ అప్పులు చేసి కార్పొరేట్లకు, బడా కంపెనీలకు కట్టబెట్టింది. లక్షల కోట్లు బడా కంపెనీలకు మాఫీ చేసిన ఘనత బీజేపీది. బీజేపీ హయాంలో రూపాయి విలువ తగ్గింది, సిపాయి విలువ తగ్గింది, నిరుద్యోగం పెరిగింది. దేశంలో అత్యధికంగా వడ్లు పండే రాష్ట్రం తెలంగాణ. కర్ణాటక నుంచి లిక్కర్ బాటిళ్లు వచ్చాయట, డబ్బులు వస్తున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసింది. 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో మీరిచ్చామని చెప్పుకుంటున్న ఉద్యోగాలు 8 లక్షలు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో మేం ఇచ్చిన ఉద్యోగాలు 1.5 లక్షలు. కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని విధానాల వల్ల కొంత ఇబ్బంది అయింది. లక్ష కోట్ల నిధులు కేంద్రం ఆపింది. అందుకే జీతాలు ఆలస్యం అయితున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితిని సరిదిద్ది ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తాం. రెండు పీఆర్సీలతో 133 శాతం జీతాలు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. మాది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగులు, చిరు ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని దీవించాలి’ అని మంత్రి హరీశ్ రావు కోరారు.

Latest News

More Articles