Saturday, June 22, 2024

వారెంటీలు లేని గ్యారెంటీలు.. కాంగ్రెస్ ఆరు హామీలపై ఆరడుగుల బుల్లెట్ ఫైర్

spot_img

నేడు తుక్కుగూడలో ఇచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీలపై ట్విట్టర్లో మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. అల‌వికాని హామీలు, అబ‌ద్ధాల ఆరోప‌ణ‌లు, చ‌రిత్ర వక్రీక‌ర‌ణ‌లు.. కాంగ్రెస్ స‌భ సాంతం ఆత్మ‌వంచ‌న‌ ప‌ర‌నింద‌గా సాగిందని విమర్శించారు. ‘ కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అస‌లు కాంగ్రెస్ కు ఓట్లు ప‌డ‌తాయ‌నే గ్యారంటే లేదు. గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుంది కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి సభలో ఇచ్చిన హామీలు. నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారు. పైగా మీరు చెప్పిన గ్యారెంటీలు కూడా మా కేసీఆర్‌ గారు అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే.

మీది జాతీయ పార్టీనా.. ప్రాంతీయ పార్టీనా ..? రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు..? దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు..? మీ సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా..? ఎందుకు చేయలేదు..?
మీరిచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు. కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల న‌డ్డి విరిచారు. అక్క‌డ మీరు ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తున్నారా..? ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం మీరు. తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా..? ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్నికలపుడు వచ్చుడు.. నోటికి వచ్చింది చెప్పుడే తప్ప మీరు ఇచ్చే గ్యారెంటీలను అమలు చేసేది ఎవరు..? 2014లో కాంగ్రెస్ ఇట్ల‌నే భూట‌క‌పు హామీలు ఇస్తే 44 ఎంపీ సీట్లు వ‌చ్చిన‌యి. 2019లో 52 వ‌చ్చిన‌యి.

రాహుల్‌ గాంధీ గారూ మీ అజ్ఞానానికి జోహార్లు. రాష్ట్రపతి ఎన్నికల్లో మేం బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. కావాలంటే మీరు పేపర్లు తిరగేసి చూడండి. మేం యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ఇచ్చాం. బాజాప్తా ఆయనకు మా పార్టీ ఓటేసింది. తెలంగాణాకు యశ్వంత్‌ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టాం. మీ నేతలనే అడగండి. అవగాహన పెంచుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మేము బీజేపీకి మద్దతు ఇవ్వలేదు.
జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడంలేదా..? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉన్నదా.. లేదా..? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు..? ఎందుకీ నయవంచక ముచ్చట్లు.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా..? గుజరాత్‌ ఎన్నికలపుడు నీ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదు..? మా దగ్గర హుజురాబాద్‌, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి సపోర్టు చేయడం మీకు తెలియదా..? తెలంగాణ ఎవ‌రి ద‌య‌తోనూ రాలేదు. ప్ర‌జ‌లు పోరాడి గెలుచుకున్న‌రు. మీరు ద‌య‌తో ఇచ్చి ఉంటే వంద‌లాది మంది యువ‌కులు ఎందుకు బ‌లిదానం చేసుకున్న‌రు’ అని విమర్శించారు హరీష్ రావు.

Latest News

More Articles