Saturday, May 18, 2024

సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’

spot_img

సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’ అని, విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత సర్వేపల్లి సొంతం అన్నారు. రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం అన్నారు.

సర్వేపల్లి బాటలోనే విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా.. పెను మార్పులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు. అన్ని వర్గాల పేద బిడ్డలకు కార్పొరేట్‌ విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తూ దేశానికే రోల్ మోడల్‎గా నిలిచాయన్నారు. గురుకులాల సీట్ల కోసం పోటీనే దీనికి నిదర్శనం అన్నారు. అందుకే గురుకులాలను యేటా పెంచుతూ పోతున్నారన్నారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర సర్కారు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. విద్యారంగంలో కేసీఆర్ తెచ్చిన గురుకులాలు కొత్త చరిత్రకు నాంది పలికాయన్నారు. ప్రైవేట్‌ బాట వీడి గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు చేరుతున్నారంటే.. వీటిని ఏ స్థాయిలో అభివృద్ధి పర్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉండగా.. వేలాది మంది విద్యను అభ్యసిస్తూ లబ్ధి పొందుతున్నారన్నారు. విద్యారంగంలో కొత్త శకం ఆవిష్కృతం అవుతుందన్నారు. సమైక్య రాష్ట్రంతో పోల్చితే విద్యారంగం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందన్నారు. ఈ విజయంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది అని కొనియాడారు. విద్యారంగంలో దేశవ్యాప్తంగా బ్రిటీష్ కాలం నాటి పద్దతులకు స్వస్తి పలకాల్సిన అవసరం, అవశ్యకత ఉందని, అది కేసీఆర్ వల్లనే సాధ్యపడుతుందని మంత్రి అన్నారు. సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’ అని కొనియాడారు. విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిది అని కీర్తించారు. మంచి సమాజం తయారు కావాలంటే మంచి విద్యతోనే సాధ్యపడుతుందన్న మంత్రి.. ఆ విద్యను భోదించే ఉపాధ్యాయులు దైవంతో సమానమన్నారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను మంత్రి జగదీష్ రెడ్డి సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్ఞా దీపికా యుగంధర్, వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles