Friday, May 3, 2024

నాణ్యమైన విద్యకు కేంద్రంగా ప్రభుత్వ పాఠశాలలు

spot_img

నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేంద్రంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని ఆయన స్పష్టం చేశారు. దీనంతటికి కారణం విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయుల శ్రమే కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన విద్యాదినోత్సవం సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సర్కార్ బడులలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యనే ప్రభుత్వ పాఠశాలల పనితీరును ప్రతిబింబింప చేస్తుందన్నారు. 2014కు పూర్వం ప్రభుత్వ స్కూళ్లలో డ్రాప్ ఔట్స్ పెరిగిన అంశాన్ని, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకున్న డిమాండ్‎ను ఆయన ప్రస్తావించారు. అటువంటి దుస్థితి నుండి ప్రభుత్వ పాఠశాలలలోనే క్యాలిటీ, క్యాలిఫికేషన్లు ఉన్నాయన్న అంశాన్ని తల్లిదండ్రులు గుర్తించడమే సీఎం కేసీఆర్ విద్యారంగంలో సాధించిన మార్పుకు సంకేతమన్నారు. అటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది విరివిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సర్కార్ చదువు అంటేనే విముఖత చూపించిన దుస్థితి నుండి సర్కార్ చదువులకై పోటీలు పడుతున్న మార్పును యావత్ తెలంగాణా సమాజం గమనించాలని మంత్రి సూచించారు. 2014కు ముందు, వెనుక అనేది అధ్యయనం చేస్తే విద్యా రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు బోధపడతాయన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, శాసనమండలి సభ్యులు యంసీ కోటిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రామచంద్రనాయక్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles