Friday, May 17, 2024

స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయించండి

spot_img

న్యూఢిల్లీ : కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్.. రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసి హైద‌రాబాద్‌లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయించాల‌ని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయిస్తే.. ల్యాండ్ ఫ‌ర్ ల్యాండ్ కూడా ఇస్తామ‌ని చెప్పినా కేంద్రం ముందుకురావడం లేదన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో ఐదుగురు ర‌క్ష‌ణ శాఖ మంత్రుల‌ను 15 నుంచి 20 సార్లు క‌లిశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. స్వ‌యంగా ప్ర‌ధానిని తమ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లిశారని గుర్తుచేశారు.

‘‘హైద‌రాబాద్ లాంటి పెరుగుతున్న న‌గ‌రానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అందిన సాయం సున్నా.మీరు స‌హాయం చేయ‌క‌పోతే చేయ‌క‌పోయారు కానీ.. క‌నీసం అభివృద్ధికి ఆటంక ప‌ర‌చ‌కండి. స్కైవేల నిర్మాణానికి ల్యాండ్ ఇస్తే.. మ‌రో ల్యాండ్ ఇస్తామ‌ని కూడా చెప్పాం. జేబీఎస్ నుంచి రాజీవ్ ర‌హ‌దారి వ‌ర‌కు స్కైవే నిర్మాణానికి 96 ఎక‌రాల ల్యాండ్ ఇవ్వ‌మ‌ని కోరాం. ప్యాట్నీ నుంచి నాగ్‌పూర్ హైవే వ‌ర‌కు 18.5 కిలోమీట‌ర్ల మేర స్కైవే నిర్మాణం కోసం 56 ఎక‌రాలు ఇవ్వాల‌ని కోరాం. దీనికి కూడా ల్యాండ్ ఫ‌ర్ ల్యాండ్ ఇస్తామ‌న్నాం. ఉప్ప‌ల్‌లో స్కైవాక్ పూర్త‌యింది. ఈ సోమ‌వారం ప్రారంభించ‌బోతున్నాం. మెహిదీప‌ట్నం రైతుబ‌జార్ వ‌ద్ద కూడా స్కైవాక్ క‌ట్ట‌బోతున్నాం. దుర‌దృష్టావ‌శాత్తు అక్క‌డ కూడా ర‌క్ష‌ణ శాఖ భూములు ఉన్నాయి. అక్క‌డ ఒక అర ఎక‌రం ల్యాండ్ కావాలి. దానికి కూడా ఇవ్వ‌ట్లేదు. ఆ స్థ‌లాన్ని వెంట‌నే ఇవ్వ‌మ‌ని కేంద్ర మంత్రిని కోరాం’’ అని కేటీఆర్ తెలిపారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కొత్త‌గా పెద్ద ఎత్తున లింక్ రోడ్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 142 లింక్ రోడ్ల‌ను ప్లాన్ చేశామన్నారు కేటీఆర్. అందులో రెండు, మూడు కారిడార్ల‌కు సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములు అడ్డు వ‌స్తున్నాయని చెప్పారు. వాటికి కూడా అనుమ‌తివ్వండి అని కేంద్ర మంత్రికి ప్ర‌త్యేకంగా చెప్ప‌డం జ‌రిగిందని, వీట‌న్నింటిని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి సానుకూలంగా ప‌రిశీలిస్తార‌ని ఆశిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News

More Articles