Sunday, May 19, 2024

100 ఓట్లకో ఇంచార్జీ.. గ్రామానికో మ్యానిఫెస్టో పెట్టండి

spot_img

కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

‘కేసీఆర్ 114 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించారు. మరుసటి రోజు వాటిలో ఒక్క కామారెడ్డి గురించే వార్తలు వచ్చాయి. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తా అని తెలిపారు. దాంతో దృష్టి అంతా కామారెడ్డి మీదే జరగుతుంది. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించినప్పుడు తెలంగాణ వస్తే ఏం వస్తది అని కామారెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నాం. 2001 జిల్లా పరిషత్ ఎన్నికలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి గులాబి జెండా ఎగిరింది. అలా రాష్ట్రవ్యాప్తంగా అందరిలోనూ స్పూర్తిని నింపింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఒక కార్యక్షేత్రాన్ని ఎంచుకోవాల్సి వస్తే కామారెడ్డిని ఎంచుకున్నారు. జలసాధన ఉద్యమం ఇక్కడి నుంచే చేశారు. పార్టీ కార్యక్రమాల నిధుల కోసం కూలి పని చేయాలని నిర్ణయించి, ఇక్కడికి వచ్చి కూలిపని చేశారు. తెలంగాణ ఇస్తాం అని మోసం చేసిన కాంగ్రెస్ 2004లో టీఆర్ఎస్‎కు భయపడి మనతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా కామారెడ్డి సీటును కాంగ్రెస్ తీసుకుంది. ఆనాడు కేసీఆర్ ప్రచారం చేస్తేనే ఆ సీటు కాంగ్రెస్ గెలిచింది.

మీరు ఒక ఓటేస్తే.. మీకోసం ముగ్గురం పనిచేస్తాం
కేసీఆర్ పోటీ చేస్తే మా నియోజకవర్గం బాగుపడుతుందని గంప గోవర్ధన్ భావించారు. అందుకే నా సీటు నుంచి మీరు పోటీచేయండి అని సీఎంను గోవర్ధన్ ఆహ్వానించారు. ఆయనను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. కేసీఆర్ పోటీచేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగితే.. కార్యకర్తలా పనిచేస్తా అన్నాడు. సరికొత్త చరిత్రకు కామారెడ్డి వేదిక కాబోతోంది. తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్ ది. నాలుగు కోట్ల ప్రజల నుదిటిపై నిత్యం మెరిసే తిలకం మన నాయకుడు కేసీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక ఒక ధృడ సంకల్పం ఉంటుంది. గంప గోవర్ధన్ కోరగానే.. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీకి ఒప్పుకున్నారు. దానికి కారణం.. నెర్రెలు బారిన ఈ నెల, నెత్తురు బారిన ఈ నెల సస్యశ్యామలం కావాలని అనుకున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసకున్నా అది సంచలనమే. సిద్ధిపేట నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు గులాబీ జెండాకు ప్రాణం పోసి, టీఆర్ఎస్ ను స్థాపించారు. కరీంనగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి ఎలుగెత్తి చాటారు. వెనుకబడ్డ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు దేశరాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారు. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఉద్యమ తెలంగాణను గత 9 ఏండ్లలో ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ది. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పనులను కేవలం 9 ఏండ్లలో చేసి కొత్త తెలంగాణను దేశానికి పరిచయం చేశారు.

కేసీఆర్ మీద పోటీ అంటే గొర్రె పొట్టేలును పోశమ్మ ముందు కట్టేసినట్టే
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారంటే.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక్కడ బీజేపీ నాయకుడు ఏకంగా ప్రకటన చేశాడు. కేసీఆర్ మీద పోటీ చేస్తే పేరు వస్తుందేమో కానీ డిపాజిట్ మాత్రం రాదు అన్నాడు. గొర్రె పొట్టేలును తీసుకుపోయి పోశమ్మ ముందు కట్టేసినట్టే అని ఒప్పుకున్నాడు. కాబట్టి కేసీఆర్‎కు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 2023లో జరిగే ఈ ఎన్నికతో కేసీఆర్ దక్షిణ భారతదేశంలో రికార్డు సృష్టించబోతున్నారు. దక్షిణ భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రులు సాధించని రికార్డు కేసీఆర్ సాధించబోతున్నారు. దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారి హ్యాట్రిక్ కొట్టిన సీఎంగా కేసీఆర్ దేశచరిత్రలో రికార్డు నెలకొల్పనున్నారు. ఆ రికార్డుకు వేదిక కామారెడ్డి కావడం ఇక్కడి వారందరికీ గర్వకారణం. చరిత్రలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గంగా కామారెడ్డి కూడా రికార్డు నెలకొల్పాలి. కేసీఆర్ విజయం ఏనాడో ఖాయమైంది. ఇప్పుడు తేలాల్సింది మెజారిటీ మాత్రమే. కామారెడ్డిలో మొత్తం 2 లక్షల 48 వేల ఓట్లున్నాయి. మీరు ఒక ఓటేస్తే.. మీకోసం ముగ్గురం పనిచేస్తాం. ఓ వైపు గంప గోవర్ధన్ ఎమ్మెల్యే కాకపోతే ఏంటి మంచి హోదాలో మీకోసం పనిచేస్తడు. మరోవైపు కేసీఆర్ శాసనసభ్యుడిగా పనిచేస్తారు.

ఎప్పుడు వచ్చినం కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? ఈ సారి రికార్డులు బద్దలు కొట్టాలె
ఎమ్మెల్యే సీట్ల విషయంలో ముదిరాజులకు కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే. వారికి ఈ వేదిక నుంచి ఓ విజ్జప్తి చేస్తున్నాను. వచ్చే ఎమ్మెల్సీ, నామినేటడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తాం. ఇక్కడ బూత్ స్థాయిలో పోటీ పెట్టుకోండి. బూత్ కమిటీలు వేయండి, 100 ఓట్లకు ఒక ఇంచార్జీని పెట్టండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మొదట తెలంగాణలో గెలవాలి, ఆ తర్వాత మహారాష్ట్రలో గెలవాలి. అప్పడు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాలి. మహారాష్ట్ర మొత్తం మనవైపై చూస్తోంది. తెలంగాణలో ఏం జరగబోతుంది అని ఆసక్తిగా ఉన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎంగా ఎంత మెజారిటీ సాధిస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు, హ్యాట్రిక్ కొడతారా అని మనవైపు చూస్తున్నారు. కాబట్టి బూత్ మీటింగులు పెట్టాలి, ప్రతి గ్రామం నుంచి మ్యానిఫెస్టో తయారుచేయాలి. సీఎం నియోజకవర్గం అంటే మజాక్ కాదు. మీకు ఏం కావాలో మీ గ్రామ మ్యానిఫెస్టోలో పెట్టండి. అది నాకు ఇయ్యండి, చేసే బాధ్యత నాది. కేసీఆర్‎ను మెజారిటీతో గెలిపియ్యండి.. నిధుల వరద పారించే బాధ్యత నాది. కేసీఆర్ వస్తే.. కామారెడ్డి మరో నాలుగు రెట్లు పైకి పాకుతుంది. కామారెడ్డిలో కేసీఆర్‎కు వచ్చే మెజారిటీ చూసి ప్రతిపక్షాల దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ కావాలె. సినిమాలో చెప్పినట్లు.. ఎప్పుడు వచ్చినం కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? ఈ సారి రికార్డులు బద్దలు కొట్టాలె, కామారెడ్డి గురించి దేశం మొత్తం చర్చించాలె. ఇప్పుడు టైం అంతా మీ కామారెడ్డి వాళ్లదే నడుస్తుంది, టైమంతా మీదే నడుస్తుంది. ఈ ఎన్నికల కోసం గ్రామాల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్లను పెట్టండి, వాట్సాప్ గ్రూపులు పెట్టండి. కామారెడ్డికి ప్రత్యేక మ్యానిఫెస్టో పెడదాం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, మీరు పెట్టిన రిక్వెస్టులన్నీ చేస్తాం.

మంత్రులుగా ఉన్నోళ్లు చేయని పని ఒక ఎమ్యెల్యేగా గంప గోవర్ధన్ చేశాడు
కామారెడ్డి జిల్లా అయినంక అధికారులందరూ మీకు చేరువయ్యారు. ఒకప్పుడు జూనియర్ కాలేజీ కోసం పడరానిపాట్లు పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది. ఇందులో 350 పడకల ఆస్పత్రి కూడా ఉంటుంది. అన్ని జబ్బులకు వైద్యం ఇక్కడే ఉచితంగా దొరుకుతుంది. ఆనాడు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులుగా ఉన్నోళ్లు చేయని పని ఒక ఎమ్యెల్యేగా గంప గోవర్ధన్ చేసి చూపాడు. 16 రాష్ట్రాల్లో బీడీలు చుట్టే వారున్నారు. ఎక్కడన్నా బీడీలు చుట్టే వారికి పెన్షన్ ఇస్తున్నారా.. అదే మన తెలంగాణలో ఇస్తున్నారు. వృద్ధులకు కాంగ్రెస్ హయాంలో రూ. 200 ఉన్న పెన్షన్.. కేసీఆర్ వచ్చిన తర్వాత రూ. 2 వేలు అయింది. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వస్తే.. ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నాయి. రైతులకు పెట్టుబడి ఇయ్యాలనే గొప్ప ఆలోచన కేసీఆర్ చేశారు. దేశ చరిత్రలో ఎవరూ ఈ పని చేయలేదు. అందులో భాగంగా రూ. 73 వేల కోట్లు అందిస్తున్నాం. పెన్షన్, రైతుబీమా తీసుకుంటున్న వారింటికి వెళ్లి.. కేసీఆర్ లెటర్ అందజేయాలి. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులందరికీ కేసీఆర్ తరఫున లెటర్లు రాయాలి. మీరే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పనిచేయాలి. ఈ సారి పోటీ ప్రత్యర్థులతో కాదు.. మెజారిటీ కోసం పనిచేయాలి. కాంగ్రెసోళ్లను, బీజేపోళ్లను తక్కువ అంచనా వేయొద్దు. కాంగ్రెసోళ్లకు కర్నాటక నుంచి పైసలు వస్తున్నాయి. బిల్డర్ల దగ్గర పైసలు వసూల్ చేసి, తెలంగాణకు పంపుతున్నారు. కేసీఆర్ పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు అక్కడ, ఇక్కడ పైసలు తెచ్చుకుంటారు. అదానీ పంపే పైసలు ప్రధాని దగ్గర దండిగా ఉన్నాయి. వాళ్లు కూడా బాగా ఖర్చు చేస్తారు. అందుకే అందరం బాగా పనిచేయాలి. కామారెడ్డిలో ఇచ్చే తీర్పు దేశం మొత్తం చర్చ జరగాలి.

బీజేపీది మేకప్.. కాంగ్రెస్‎ది ప్యాకప్
బీజేపీది ఒట్టి మేకప్ అయితే.. కాంగ్రెస్‎ది ప్యాకప్. కాంగ్రెసోళ్లు ఓటుకు నోటు దొంగ చేతిలో పార్టీని పెట్టారు. ఓటుకు నోటు దొంగ ఓ దిక్కు.. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన దొంగ ఓ దిక్కు ఉన్నారు. వీళ్లిద్దరితో కేసీఆర్ కు పోటా. రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి అమెరికా పోయిండు. రేవంత్ రెడ్డి ఏకంగా గన్ తీసుకొని ఉద్యమ కారుల మీదికి పోయిండు. వీళ్లు మనకు పోటీనా? ఆనాడు ఓటుకు నోటు.. ఈనాడు సీటుకో రేటు. కాంగ్రెస్‎లో ఇప్పటికే లొల్లి మొదలైంది. కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డిని.. రేట్ ఎంత రెడ్డి అంటున్నారు. అయినా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే 10, 12 మందితో బీజేపీలో చేరడం ఖాయం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఫంక్తు ఆర్ఎస్ఎస్ మనిషి. ఆయన మొదలు నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశాడు. అందుకే ఆయనకు బీజేపీ వాళ్లతో చీకటి ఒప్పందం ఉంది.

మనమే శాసించే స్థాయికి ఎదుగుతున్నాం
ఢిల్లీ నుంచి వచ్చినోళ్లు మీరు కాంగ్రెస్ బీ టీం, బీజేపీ బీ టీం అంటారు. ఎవ్వని బీ టీం అవ్వాల్సిన అవసరం మనకు ఏముంది. 23 ఏండ్లుగా తెలంగాణ ప్రజలను నమ్ముకొని పోతున్నం. ఇప్పుడు కూడా అలాగే పోతాం. ఎవడికో తొత్తుగా, తోకపార్టీగా, బీ టీంగా ఉండాల్సిన ఖర్మ మనకు లేదు. మనమే శాసించే స్థాయికి ఎదుగుతున్నాం. అందుకే ప్రతిపక్షాలకు మింగుడు పడటంలేదు. రోషం గల బిడ్డలం మనం.. ఢిల్లీ గులాంలం కాదు.. గుజరాత్ బానిసలం కాదు. కాంగ్రెస్, బీజేపీలు బీఫాంలు ఢిల్లీలో ఇస్తాయి. వాళ్లు బాత్రూం పోవాలన్నా.. ఢిల్లీ బాసుల అనుమతి కావాల్సిందే. అటువంటి బానిసలు మనకు అవసరమా? మన మొనగాడు మన కేసీఆర్ మన దగ్గరే ఉన్నాడు. కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క చాన్స్ అని అడుగుతోంది. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్‎కు 11 చాన్సులిచ్చాం. అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు చేస్తారా? చచ్చిన పీనుగులాంటి కాంగ్రెస్‎వి దింపుడుగల్లం ఆశలు. దాన్ని లేపేందుకు ఆరు గ్యారెంటీలు అని చెబుతున్నారు.

కామారెడ్డి చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి కేసీఆర్ గెలుపు నాందికావాలి
అదే కాంగ్రెసోళ్లు ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు, 24 గంటల కరెంట్ ఎక్కడిది అంటున్నాడు. కాంగ్రెస్ నాయకులంతా వరుసగా వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకుంటే తెలుస్తుంది, కరెంట్ వస్తుందా లేదా అని. 2014కు ముందు కరెంట్ ఎలా వచ్చేది ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు అయింది. ఈ కాలంలో తెలంగాణ బాగుపడిందా లేదా మీరే ఆలోచన చేయాలి. మైనారిటీ విద్యార్థుల కోసం స్కూళ్లు పెట్టలేదా? మైనారిటీల కోసం ఈ 9 ఏండ్లలో 8 వేల కోట్లు ఖర్చు చేశాం. ముఖ్మమంత్రిని మార్చేందుకు నరమేధం సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. పాతబస్తీలో 400 మందిని చంపింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే మరణ మృదంగం, బాంబు పేళుల్లు, ఫైరింగులు, కల్లోలం, సంక్షోభం. అటువంటి కాంగ్రెస్ ఎందుకు? అందరినీ మావాడే అనుకునే కేసీఆర్‎ను తెచ్చుకుందామా? కామారెడ్డి చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి కేసీఆర్ గెలుపు నాందికావాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles