Monday, May 20, 2024

పథకాలు, సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్

spot_img

వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సంక్షేమ సంబరాలకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివిధ పథకాల లబ్దిదారులకు చెక్కులు అందజేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ , జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సబ్బండ వర్ణాలకు సర్కారు చేయూత అందిస్తుందని, పథకాలు, సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ పెద్దమనసుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దేశంలో ఎక్కడా తెలంగాణ తరహా పథకాలు లేవని తెలిపారు.

‘‘దేశంలో ఎక్కడా కళ్యాణలక్ష్మి వంటి పథకం లేదు. పేద ఆడబిడ్డల కోసం రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కాన్పు చేసి కేసీఅర్ కిట్ ఇచ్చి వాహనంలో ఇంటి వద్ద దింపుతున్నారు. రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది ఒక్క తెలంగాణ లోనే. ఒక్కో విద్యార్థి మీద ఏటా  రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ లక్షల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ రేపటి తరాన్ని తయారుచేసుకుంటున్నాం.

కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైకుభీమా, దళితబంధు, ఆసరా వంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. వనపర్తిలో 600 పడకల ఆసుపత్రి నిర్మించుకుని భవిష్యత్ లో పేదలు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా చేస్తున్నాం. ప్రతి రెండు, మూడు గ్రామాల మధ్యన ఒక పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తున్నాం. డయాలసిస్ కోసం పేదలు ఎక్కడికీ వెళ్లకుండా వనపర్తి లోనే పది బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాం.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు దశలవారీగా అమలు చేస్తున్నాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సామాజిక అసమానతలను రూపుమాపేందుకే సంక్షేమ పథకాలతో చేయూత అందిస్తున్నం. 14 ఏండ్లు కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. 9 ఏళ్లుగా రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నాం. ఏరువడ్డ తర్వాత బాగుపడ్డమని ఇప్పుడు దశాబ్ది సంబరాలు చేసుకుంటున్నాం.’’ అని మంత్రి అన్నారు.

Latest News

More Articles