Monday, May 20, 2024

నెంబర్ వన్ గా మహబూబ్ నగర్

spot_img

గ‌తంలో 50,60 ఏళ్లలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35-40 ఏళ్లలోనే చూస్తున్నామని.. ఆరోగ్యకరమైన జీవన విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మున్ముందు ఇబ్బందులు ఎదుర్కునాల్సి రావచ్చని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఆపరేటివ్ ఆర్థోప్లాస్టీ కోర్స్, లైవ్ సర్జరీస్ అండ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మోకాళ్ల నొప్పులు రాకుండా తీసుకునాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. ఎలాంటి ఆహారం, మందులు తీసుకునాలో వివరించాలన్నారు. ఆర్థరైటిస్ పై ప్రజలకు ఎప్పటికప్పుడు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

వైద్య రంగంలో మహబూబ్ నగర్ నెంబర్ వన్ అయ్యేలా చూసే బాధ్యత వైద్యులపై ఉందని తెలిపారు. అత్యాధునిక వైద్యానికి మనం కేరాఫ్ అడ్రస్ గా మారాలని పిలుపునిచ్చారు. ఎస్వీఎస్ లో వివిధ వైద్య అంశాలపై పరిశోధనలు జరగాలన్నారు. హైదరాబాద్ స్థాయిలో ఇక్కడే సూపర్ స్పెషాలిటీ వైద్యం లభించాలని, ఇక్కడికే దేశ విదేశాల నుంచి వైద్యులు వచ్చేలా చూడాలన్నారు. మహబూబ్ నగర్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చామని, వివిధ పరిశ్రమలు, సంస్థలు ఇక్కడికి తరలివచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. దివిటిపల్లి ఐటీ కం ఎనర్జీ పార్కులో ప్రఖ్యాత అమరరాజా లిథియం గిగా పరిశ్రమ ద్వారా 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. త్వరలో ఫుడ్ పార్క్ ద్వారా కూడా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 26వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ మన పట్టణానికి మణిహారంగా మారుతోందని మంత్రి తెలిపారు.

Latest News

More Articles