Sunday, May 19, 2024

కేసీఆర్ గన్ అయితే ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు

spot_img

‘ఉద్యోగుల వల్లే దేశం బాగుంది.. వారి కష్టం వల్లే దేశం ముందుకు నడుస్తోంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ గన్ అయితే ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అని ఆమె ఉద్యోగులను అభినందించారు. నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు.

‘భారత దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికలు జరుగుతాయి. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఎన్నికల తంతు సజావుగా సాగడానికి ప్రధాన కారణం ఉద్యోగ, ఉపాధ్యాయులే. వారి వల్లే దేశం బాగుంది. వారి కష్టం వల్లే దేశం ముందుకు నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం, మాతృ విముక్తి కోసం ఉద్యోగులు ఆ రోజు త్యాగాలు చేశారు. తెలంగాణ ఉద్యోగులతో కేసిఆర్‎కు ఉన్నది తల్లి పేగు బంధం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఉద్యోగులు కేసీఆర్ బంధువులు. దేశంలో ఇస్తున్న అవార్డులలో ఫస్ట్ మూడు అవార్డులు తెలంగాణకు వస్తున్నాయి. కేసీఆర్ గన్ అయితే.. బుల్లెట్లు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఉద్యోగుల కష్టం చాలా ఉంది. పీఆర్సీ లాంటి విషయాలు చెప్పుకోవాల్సిందే. ఇది మన కుటుంబ సమస్య. సమస్య చెప్పకపోతే నన్ను దూరం చేసినట్టు అవుతుంది. కచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం.

మనమేమో ఉద్యోగుల కోసం పాటు పడుతుంటే.. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉద్యోగులు గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. కొత్త ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ బాధ పడుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే వారి వెనక జెండా పట్టుకోవడానికి ఎవరూ ఉండరని భయపడుతున్నారు. రేపటి రోజు.. దేశం మొత్తం తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుతుంది. బీహెచ్ఈఎల్, సింగరేణి లాంటివి బతికాయంటే అది తెలంగాణ వల్లే. కేంద్రం మాత్రం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోంది. ఉద్యోగుల పట్ల మోడీ వైఖరీ ఎలా ఉందో గమనించాలి’ అని కవిత అన్నారు.

Latest News

More Articles