Monday, May 20, 2024

ఈ నెలాఖరుకు మరిన్ని పల్లె దవాఖానలు

spot_img

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి 3,206 పల్లె దవాఖానలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వాటి ల్లో అవసరమైన 321 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ చేపట్టిన వివిధ పనులపై గురువారం సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉ దయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గం టల వరకు పల్లె దవాఖానలు పనిచేయాలని, డాక్టర్‌ ఫోన్‌ నంబర్‌, పని వేళలు, సేవలు, పరీక్షల వంటి విషయాలను స్పష్టంగా బోర్డుపై రాసి ఉంచాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారని, వాటిని జూన్‌ నెలాఖారు నాటికి అందుబాటులోకి తేవాలని కోరారు. ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో 57 బస్తీ దవాఖానలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

పనుల పురోగతిపై నెలవారీ సమీక్ష
రాష్ట్రంలో చేపట్టిన వివిధ దవాఖానల నిర్మాణాలపై ఇకపై నెలవారీగా సమీక్షిస్తానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ, టిమ్స్‌ దవాఖానల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. వరంగల్‌ హెల్త్‌ సిటీ పనులను దసరా నాటికి పూర్తిచేసి, ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌ దవాఖానల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్‌ విస్తరణలో భాగంగా నిర్మించే 2 వేల పడకల భవనానికి 10 రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

67 రోజుల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు
కంటివెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 67 పనిదినాల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేశారని, 19.64 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ ఇచ్చామని, 15.30 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ అవసరమని గుర్తించామని, ఇందులో 12 లక్షల మందికి పంపిణీ చేశామని వెల్లడించారు. జిల్లాల్లో ప్రిస్రిప్షన్‌ గ్లాసెస్‌ పంపిణీని త్వరగా పూర్తి చేయాలని, హైదరాబాదులో ప్రత్యేకంగా డ్రైవ్‌ చేపట్టాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. 2014 నాటికి రాష్ట్రంలో 3 డయాలిసిస్‌ కేంద్రాలు ఉండగా, నేటికి 102కు పెంచుకున్నట్టు చెప్పారు. సిద్ధంగా ఉన్న కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభించి, ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలని చెప్పారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఈ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైద్యశాఖలో 1331 మంది క్రమబద్ధీకరణ
వైద్యారోగ్య శాఖలోని ఏడు విభాగాల్లోని 1331 మందిని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5 వేలకుపైగా మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్‌ తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. గురువారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఉత్తర్వులను ఆయా యూనియన్ల ప్రతినిధులకు అందజేశారు. కుటుంబ సంక్షేమ విభాగంలో మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) 68 మంది, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 72 మంది, డీపీహెచ్‌ విభాగంలో 156 ఫార్మసిస్ట్‌, 177 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 2 పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌, 837 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌), ఆయుష్‌ విభాగంలో 19 మంది మెడికల్‌ ఆఫీసర్ల ఉద్యోగాలు పర్మనెంట్‌ అయ్యాయి. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీరించడంపై సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావుకు యూనియన్లు కృతజ్ఞతలు తెలిపాయి.

Latest News

More Articles