Friday, May 3, 2024

హైదరాబాద్‎లో రేవ్ పార్టీ.. డ్రగ్స్‎తో దొరికిన సినీ నిర్మాత

spot_img

హైదరాబాద్‌‎లో బుధవారం అర్థరాత్రి రేవ్‌పార్టీ కలకలం రేగింది. మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారని నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. దాంతో వారు అపార్ట్‌మెంట్‌ మీద దాడులు చేసి, భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురుని అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ సినీ నిర్మాత వెంకట్‎తో పాటు పలువురు ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన యువతులు ఉన్నారు. అరెస్టయిన వారిని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాధాపూర్ పోలీసులకు అప్పజెప్పారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వారికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

పట్టుబడిన వారిలో బాలాజీ, కె. వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి, మధుబాల, మెహక్, వెంకట్ ఉన్నారు. వీరి నుంచి కోకైన్, ఎల్ఎస్డీ, ఎక్సాటసీ పిల్స్, మరియు గాంజాతో పాటు 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో వెంకట్ సినీరంగానికి చెందివవాడు. డమరుకం, పూల రంగడు, లవ్లీ, ఆటో నగర్ సూర్య సినిమాలకు వెంకట్ ఫైనాన్సియర్‎గా పని చేశాడు. ఈయన ఆధ్వర్యంలోనే డ్రగ్స్ పార్టీ జరగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మరో నిందితుడు బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్ ఇలా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో అధికారులు నిఘా పెట్టారు. వెంకట్‎కు డ్రగ్స్ పెడలర్లతో సంబంధాలున్నాయా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ పార్టీ గురించి వెంకట్ వాట్సాప్ చాట్ చేసినట్లు గుర్తించారు.

Latest News

More Articles