Sunday, May 12, 2024

ఆల్ టైం రికార్డ్ దిశగా తెలంగాణ

spot_img

రాష్ట్రంలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గత మూడేండ్ల నుంచి వరుసగా 60 లక్షల ఎకరాలు దాటిన వరిసాగు ఈ వానకాలం ఆల్‌టైం రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది. నిరుటి సాగు రికార్డును బద్దలు కొట్టేందుకు కేవలం లక్ష ఎకరాల దూరంలోనే ఉన్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 63.55 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నిరుడు వానకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఈ సీజన్‌లో ఇంతకు మించి సాగయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల పథకాలతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. ఐదేండ్ల నుంచి పంటల సాగు పెరుగుతున్నది. 2014-15 వానకాలం లో కేవలం 22.74 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా, నిరుడు 64.54 లక్షల ఎకరాలకు ఎగబాకింది. 2021-22లో 61.94 లక్షలు, 2022-23లో 64.54 లక్షలు, ఈ ఏడాది ఇప్పటివరకు 63.55 లక్షల ఎకరాల చొప్పున వరి సాగైంది. ఇలా వరుసగా మూడేండ్లు 60 లక్షల ఎకరాలు దాటి రాష్ట్ర వ్యవసాయరంగం తన విశిష్టతను చాటింది. ఈ వానకాలం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.25 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వరి సాగవగా, పత్తి 45 లక్షలు, మొక్కజొన్న 5.41 లక్షలు, కంది 4.73 లక్షలు, సోయాబీన్‌ 4.66 లక్షల ఎకరాల చొప్పున సాగయ్యాయి. ఇదే సమయానికి నిరుడు 1.31 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.

Latest News

More Articles