Friday, May 17, 2024

పోలీసుల అలర్ట్.. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తమ విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోంది. ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది.

కాగా.. మరో రెండు రోజుల్లో ఈ నెల 3 నుండి నామినేషన్ల పర్వం మొదలుకానుండటంతో పోలీసులు కూడా తమ దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పోలీస్ శాఖ అలర్ట్ అయింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆర్వో కార్యాలయాల వద్ద శాంతి భద్రతలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నామినేషన్ కేంద్రాల వద్ద నాలుగు అంచల భద్రతను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కో నామినేషన్ కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్‎గా నియమించనున్నారు. ర్యాలీలు, సమావేశాల అనుమతులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమన్వయంగా ముందుకెళ్లాలని పోలీస్ శాఖ సూచించింది. హైదరాబాద్‎లో 15 నామినేషన్ కేంద్రాలు, రాచకొండలో 8 నియోజకవర్గాలకు నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాచకొండ పరిధిలోని 3,326 పోలింగ్‌ స్టేషన్లు ఎన్నికల విధులలో పనిచేయనున్నాయి. అందులో భాగంగా 19 చెక్ పోస్ట్‎లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఫ్లెయింగ్ స్క్వాడ్స్‎ను ఏర్పాటు చేశారు.

Latest News

More Articles