Sunday, May 12, 2024

దేశాభివృద్ధిలో తెలంగాణదే కీలకపాత్ర

spot_img
  • దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదే
  • తొమ్మిదేండ్లలోనే మూడు రెట్లు పెరిగిన జీఎస్‌డీపీ

హైదరాబాద్‌: దేశాభివృద్ధిలో తెలంగాణ స్టేట్ కీలకపాత్ర పోషిస్తున్నదని, దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తున్నదని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలో ఈ విషయాలను స్పష్టం చేసింది. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాల వాటాను విశ్లేషించింది.

తెలంగాణ గత తొమ్మిదేండ్లలో అనేక పెద్ద రాష్ట్రాలను అధిగమించింది. 2014-15 నాటికి రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్‌డీపీ.. 2022-23 చివరినాటికి రూ.13.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో తలసరి ఆదాయంలోనూ తెలంగాణ రికార్డు సృష్టించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162 కోట్లుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. రూ.2,75,443 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ సుమారు 5 శాతం వాటాను కలిగి ఉన్నదని ఆర్బీఐ వెల్లడించింది.

దేశాన్ని పోషిస్తున్న దక్షిణాది

దేశ మొత్తం జనాభాలో 19 శాతాన్ని మాత్రమే కలిగివున్న ఈ 5 రాష్ట్రాలు(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ) జీడీపీలో 30 శాతం వాటా కలిగి ఉండగా.. మిగతా 25 రాష్ట్రాల వాటా 70 శాతంగా ఉండటం గమనార్హం. ఇంతలా దేశాన్ని పోషిస్తున్న దక్షిణాదిపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతూ ఉత్తరాదికి నిధుల వరద పారిస్తుండటం విచారకరం.

అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం

జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి విషయంలోనూ తెలంగాణానే అగ్రస్థానంలో ఉన్నది. మన రాష్ట్ర జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి 25.3 శాతం మాత్రమే. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. కర్ణాటకలో జీఎస్‌డీపీ-రుణాల నిష్పత్తి 27.5 శాతంగా ఉండగా.. తమిళనాడులో 27.7%, ఏపీలో 32.8%, కేరళలో 37.2 శాతంగా ఉన్నది. వడ్డీలకు అత్యల్పంగా (11.3 శాతం) చెల్లిస్తూ అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది.

south states per capita

Latest News

More Articles