Tuesday, May 21, 2024

గ్రేటర్‎లో వార్డు కార్యాలయాలు ప్రారంభం.. వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థ శాశ్వతం

spot_img

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. కాచిగుడా వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‎తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘జీహెచ్ఎంసి తన స్వరూపాన్ని మ‌రోసారి మార్చుకోనుంది. నేటి నుంచి సరికోత్త పాలన అందుబాటులోకి రానుంది. వార్డు కార్యాలయాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసింది. వార్డు అధికారితోపాటు మొత్తంగా వార్డులో 10మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు నిత్యం పబ్లిక్‎కు అందుబాటులో ఉండనున్నారు. దాంతో ప్రజా సమస్యలు అక్కడిక్కడే పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయ్యాలనే సిటిజన్ చార్టర్‎ను కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నాం.

మన రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఒక హైదరాబాద్లోనే కోటికి పైన జనాభా ఉంది. అధికారులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలని వార్డు పరిపాలన తీసుకొచ్చాం. గ్రామాలలో పంచాయతీ సెక్రెటరీ, ఇతర సిబ్బంది ఉంటారు. చిన్న చిన్న మున్సిపాలిటీలలో వార్డుకొక ఆఫీసర్ ఉంటారు. మరి కోటికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో 35,000 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అందుకోసమే వార్డు కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నాం. ప్రతి వార్డుకు పదిమంది సిబ్బంది ఉంటారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డుకు నేతృత్వం వహిస్తారు. సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా సిబ్బంది ఉండాలని అంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం సమయాన్ని కూడా ఇచ్చాం. అందుకోసం సిటిజన్ చార్టర్ ఇచ్చాం. జవాబు దారితనం, సుపరిపాలన కోసం వార్డ్ కార్యాలయం ఏర్పాటు చేశాం. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రాజకీయాలకతీతంగా పనిచేయాలి. వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థ శాశ్వతం. దేశం మొత్తం మనవైపు చూస్తుంది. ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా తీసుకోండి, వేరే పార్టీ వారు అని చూడకండి. ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థను ఉపయోగించుకోవాలి. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వార్డు కార్యాలయాలను మానిటర్ చేయాలి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles