Sunday, May 19, 2024

ఒడిశా రైలు ప్రమాదంలో 120 మంది తెలుగువారు

spot_img

ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ప్రమాదంలో 233 మంది దుర్మరణం చెందగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. ఈ ప్రమాదం జరిగిన కోరమాండల్ రైలులో 120 మంది తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ వీరి జాడ తెలియలేదు. దాంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నారు. ఈ రైలు ప్రమాదం ఘటన మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్‎కు ఏపీలో ఆరు స్టేషన్లు ఉన్నాయి. విశాఖపట్రం, ఏలూరు, తాడేపల్లి గూడెం, తెనాలి, నెల్లూరు, ఒంగోలులో ఈ రైలు ఆగనుంది. దాంతో రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, బాపట్ల, తెనాలి, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంటలలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.

రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. తాజా దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

Latest News

More Articles