Monday, May 20, 2024

పార్లమెంట్ చరిత్రలో తొలిసారి.. 141 మంది ఎంపీలు సస్పెండ్

spot_img

పార్లమెంట్ లో విపక్షాల నిరసనలతో గందరగోళం నెలకొంది. ఈ నెల 13న లోక్ సభలో ఆగంతుకుల చొరబాటుకు సంబంధించి భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ విపక్ష ఎంపీలపై వేటు వేశారు. ఈ మేరకు సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్ సభ ఆమోదించింది.

అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారీ, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, డానిష్ అలీ సస్పెండైన వారిలో ఉన్నారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. కాగా, లోక్ సభలో గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకూ లోక్ సభలో 95 మంది ఎంపీలపై వేటు పడింది. అటు, రాజ్యసభలోనూ ఇప్పటివరకూ 46 మంది సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై వేటు పడినట్లైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 (శుక్రవారం)తో ముగియనున్నాయి.

Latest News

More Articles