Wednesday, May 22, 2024

142 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన కీచక ప్రిన్సిపల్‌

spot_img

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారితప్పితే.. తానో ప్రభుత్వ ఉద్యోగినని మరచి మృగంలా ప్రవర్తిస్తే.. ఓ ఉపాధ్యాయుడు అచ్చం ఇలానే మారాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరేళ్లుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన హర్యాణాలోని జింద్‎లో వెలుగుచూసింది.

జింద్‎లోని ఓ ప్రభుత్వ పాఠశాలో దాదాపు 390 విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపల్‌ చేస్తోన్న అఘాయిత్యాల గురించి వివరిస్తూ గత ఆగస్టు నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లకు లేఖ రాశారు. సెప్టెంబర్‌లో హర్యాణా మహిళా కమిషన్‌ వారి లేఖను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని జింద్‌ పోలీసులకు సూచించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా లైంగిక వేధింపులు వాస్తవమేనని తేలడంతో నవంబర్‌ 4న ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

అయితే ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి మొదట 60 మంది విద్యార్థినులు ముందుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరిందని మహిళా కమిషన్‌ పేర్కొంది. ప్రిన్సిపల్‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ప్రిన్సిపల్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 142 మంది విద్యార్థినులు ఆరోపించడం హర్యాణాలో సంచలనం సృష్టిస్తోంది.

Latest News

More Articles