Friday, May 17, 2024

కొత్త పార్లమెంటు ప్రారంభానికి దూరంగా 19 పార్టీలు.. అవేంటంటే??

spot_img

కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కొత్త పార్లమెంటు ప్రారంభానికి 19 పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్‌ను ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని పేర్కొన్నాయి. పార్లమెంట్‌ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనబెట్టినప్పుడు, ఇక కొత్త పార్లమెంట్‌ భవనంలో ఏ విలువా కనిపించడం లేదని ప్రతిపక్షాలు మండి పడ్డాయి. ఈ మేరకు కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, ఎస్పీ, వామపక్షాలు సహా 19 పార్టీలు బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం ఒక మహత్తరమైన సందర్భమని, అయితే ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం నేరుగా చేస్తున్న ప్రత్యక్ష దాడికి నిరసనగా తాము ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకొన్నట్టు స్పష్టం చేశాయి. ‘ప్రజాస్వామ్యానికి బీజేపీ ప్రభుత్వం ముప్పుగా పరిణమించినా, కొత్త పార్లమెంట్‌ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిరంకుశంగా ముందుకు వెళ్లినా, విభేదాలను పక్కనపెట్టి ప్రారంభోత్సవానికి హాజరుకావాలని అనుకొన్నాం. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కకు పెట్టి, ప్రధాని మోదీ తానే పార్లమెంట్‌ను ప్రారంభిస్తుండటం.. రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా, నేరుగా మన దేశ ప్రజాస్వామ్యంపై జరిపిన దాడిగా భావిస్తున్నాం’ అని విపక్షాలు పేర్కొన్నాయి.

అప్రజాస్వామిక చర్యలు కొత్తమే కాదు
‘పార్లమెంట్‌ విలువలు, నిబంధనలకు నిర్దాక్షిణ్యంగా తూట్లు పొడిచిన ప్రధానికి అప్రజాస్వామిక చర్యలు కొత్తేం కాదు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలు దేశ ప్రజల సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్‌ చేశారు. నిరంకుశ ప్రధాని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం”అని ప్రతిపక్షాలు తెలిపాయి.

అత్యున్నత పదవిని అవమానించడమే..
‘రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం కూడా. పార్లమెంట్‌ నిర్వహణలో కీలక బాధ్యతలు కలిగి ఉంటారు. పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణకు పిలుస్తారు. సభలు ప్రొరోగ్‌ చేయడం, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు. రాష్ట్రపతి లేకుండానే పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నిర్ణయించడం అత్యున్నత రాష్ట్రపతి పదవిని అవమానించడమే” అని విపక్షాలు పేర్కొన్నాయి. ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించకపోవడం ఏమిటని విపక్ష నేతలు తప్పుబడుతున్నారు.

బహిష్కరించిన పార్టీలు ఇవే..
కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, ఆప్‌, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన(యూబీటీ), ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, జేఎంఎం, ఎన్‌సీ, కేసీ(ఎం), ఆర్‌ఎస్పీ, వీసీకే, ఎండీఎంకే, ఆరెల్డీ.

ఉద్దేశపూర్వకమేనా?
సరిగ్గా సావర్కర్‌ జయంతి రోజున కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే ఇది కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదా? లేక యాదృచ్ఛికమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారతానికి చిహ్నమైన పార్లమెంట్‌ భవనాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం వద్ద క్షమాభిక్ష కోరుకొన్న సావర్కర్‌ పుట్టిన రోజున ప్రారంభించడం, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులను అవమానించడమేనని విమర్శకులు పేర్కొంటున్నారు.

నేడు నిర్ణయం తీసుకుంటాం: కేకే
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలా వద్దా అనే విషయంపై గురువారం నిర్ణయం తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తెలిపారు. దేశ నిర్మాణంలో, భారత రాజ్యాంగాన్ని రచించడంలో చేసిన కృషిని గౌరవిస్తూ నూతన పార్లమెంట్‌ భవనానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని బీఆర్‌ఎస్‌ ఇది వరకే డిమాండ్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలతో చర్చించి హాజరుపై నిర్ణయం తీసుకుంటారని బీఆర్‌ఎస్‌ ఎంపీ ఒకరు తెలిపారు.

Latest News

More Articles