Thursday, May 2, 2024

విరుచుకుపడిన ముంబై బౌలర్.. లక్నోపై భారీ విజయం

spot_img

పేసర్ల జోరు సాగిన పోరులో ముంబై ఇండియన్స్‌ విజృంభించింది. లీగ్‌ దశలో పడుతూ లేస్తూ.. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్‌కు చేరిన రోహిత్‌ సేన.. ఎలిమినేటర్‌లో విశ్వరూపం కనబర్చింది. మొదట బ్యాటింగ్‌లో తలాకొన్ని పరుగులు చేసి మంచి స్కోరు చేసిన ముంబై.. ఆనక బౌలింగ్‌లో ఆకాశ్‌ చెలరేగిపోవడంతో సునాయాసంగా నెగ్గి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో రోహిత్‌ సేన 81 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను మట్టికరిపించింది. శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

కామెరూన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ (26; 2 సిక్సర్లు), నేహల్‌ వధేరా (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 4, యష్‌ ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. స్టోయినిస్‌ (40; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఒంటరి పోరాటం చేయగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ప్రేరక్‌ (3), కృనాల్‌ పాండ్యా (8), కైల్‌ మయేర్స్‌ (18), ఆయుష్‌ బదోనీ (1), నికోలస్‌ పూరన్‌ (0), దీపక్‌ హుడా (15), కృష్ణప్ప గౌతమ్‌ (2) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మధ్వాల్‌ 3.3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. ముగ్గురు లక్నో బ్యాటర్లు రనౌట్‌ రూపంలో వెనుదిరిగారు. ఆకాశ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమిష్టిగా సత్తాచాటిన ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై రోహిత్‌ సేన గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. బ్యాటర్లంతా తలా కొన్ని పరుగులు చేయడంతో మంచి స్కోరు చేసిన ముంబై.. ఆనక కట్టుదిట్టమైన బౌలింగ్‌, పటిష్ట ఫీల్డింగ్‌తో లక్నో ఆట కట్టించింది. యువ పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ 5 వికెట్లతో లక్నో బ్యాటింగ్‌ వెన్ను విరిచాడు. తాజా సీజన్‌లో ధోనీ సేన ఇప్పటికే ఫైనల్‌ చేరుకోగా.. తుదిపోరుకు చేరేందుకు శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో రోహిత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది.

Latest News

More Articles