Saturday, May 18, 2024

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 233 మంది దుర్మరణం

spot_img

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో 233 మంది దుర్మరణం చెందగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. తాజా దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.

ప్రమాదం ఎలా జరిగిందంటే..
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని అమితాబ్‌ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్‌ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు.

ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన అని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాత పడటం, మరెందరో తీవ్రంగా గాయపడటం పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తగిన రీతిలో ఆదుకొని, వారికి భరోసా కల్పించాలని కోరారు.

పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైలు ప్రమాదం దృష్ట్యా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేయడమే కాకుండా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 48 రైళ్లను రద్దు చేసినట్లు, 39 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరో 10 రైళ్ల ప్రయాణ దూరాన్ని కుదించినట్లు ప్రకటించారు.

Latest News

More Articles