Monday, May 13, 2024

పార్లమెంట్‌లో ఇవాళ ఒకే రోజు 78 మంది ఎంపీల సస్పెన్షన్‌

spot_img

పార్లమెంట్‌ లో గతవారం జరిగిన భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల  నిరసనలతో ఇవాళ(సోమవారం) కూడా లోక్‌ సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు సోమవారం ఒక్క రోజే 78 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. లోక్‌సభ లో 33 మంది, రాజ్యసభ లో 45 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ప్రకటించారు. వీరిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో ముగ్గురిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు. ఎంపీలు కె. జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీఖ్‌ స్పీకర్‌ పోడియం దగ్గర నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

మరోవైపు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ, ఆ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ, కకోలి ఘోష్‌, శతాబ్ది రాయ్‌ తదితరులు ఉన్నారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. ఆ తర్వాత స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎంపీలు జైరాం రమేశ్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ సహా పలు పార్టీల విపక్ష నేతలపై ఈ వేటు పడింది. వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో 11 మందిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు. దీంతో నేటి సస్పెన్షన్‌తో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తంగా 92 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.

ఇది కూడా చదవండి: రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు

Latest News

More Articles