Sunday, April 28, 2024

ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

spot_img

హైదరాబాద్:  ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డారని మాజీమంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్లతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అందరూ ఆహ్వానించదగ్గదే అయిన ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.

ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకునే చర్యలకు ఉపక్రమించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ప్రయాణ పథకం లేకున్నా అక్కడి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం సహాయం అందిస్తున్నది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 24 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడంతోపాటుగా, ఆటోల పైన ఉన్న రుణాలను మొత్తం ఏకకాలంలో మాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కూడా చూపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లకు తను ఎల్లప్పుడు అండగా ఉంటానని ఆటో డ్రైవర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు.

కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఆటో డ్రైవర్లు మనోస్తైర్యం కోల్పోవద్దని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసామన్నారు. తమ హయాంలో మహబూబ్ నగర్ పట్టణంలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తే, సిటీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు తమతో ఆవేదన వ్యక్తం చేస్తే వెంటనే సిటీ బస్సులను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ఓలా లాంటి సంస్థలను కూడా మహబూబ్ నగర్  లో అడుగుపెట్టనియ్యలేదన్నారు. ఆటో డ్రైవర్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని  ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రభుత్వానికి సూచించారు.

Latest News

More Articles