Friday, May 17, 2024

బీజేపీ ప్రభుత్వంలో కమీషన్ దందాకు మరో కాంట్రాక్టర్ బలి

spot_img

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ‘40% కమీషన్‌’ దందాకు అడ్డే లేకుండా పోయింది. కమీషన్‌ ఇచ్చుకొంటేనే బిల్లుల మంజూరు.. లేకుంటే ఆత్మహత్యనే శరణ్యం అనేలా ఉన్నది కాంట్రాక్టర్ల దుస్థితి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడటం లేదా కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతికి మొరపెట్టుకునే దారుణ పరిస్థితులు కర్ణాటకలో నెలకొన్నాయి.

బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్‌ ప్రసాద్‌ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అప్పులు చేసి మరీ చేసిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయడంలో బొమ్మై సర్కార్‌ అలసత్వం అతని ప్రాణాలు తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా టీఎన్‌ ప్రసాద్‌ రూ.16 కోట్ల సివిల్‌ కాంట్రాక్టు పొందాడు.

పనులు చేసేందుకు భారీగా అప్పులు చేశాడు. పనులు పూర్తయి చాలా రోజులు గడిచినా బొమ్మై ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. దీంతో సొంత ఇల్లు అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాడని ఆయన స్నేహితుడు, కర్ణాటక సివిల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బల్‌రాం తెలిపారు. ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటంతో అప్పులు తీర్చే దారి లేక ప్రసాద్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. కాంట్రాక్టులో భాగంగా పునరుద్ధరణ పనులు చేసిన ప్రభుత్వ ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం.

మాకు చావు తప్ప మరో దిక్కు లేదు..
కర్ణాటకలో బీజేపీ హయాంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. బిల్లుల మంజూరు చేయాలంటే 40 శాతం కమీషన్లు చెల్లించాలని మంత్రులు, అధికారులు డిమాండ్‌ చేస్తున్నారని వాపోతున్నారు. తన చావుకు మంత్రి ఈశ్వరప్పనే కారణమంటూ గత ఏడాది ఏప్రిల్‌లో సంతోష్‌కుమార్‌ అనే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఈశ్వరప్పపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయనకు వ్యతిరేకంగాఆధారాలు లభించలేదని క్లీన్‌చిట్‌ ఇచ్చేయడం కూడా జరిగిపోయింది.

ఈ ఘటనే కాదు.. లంచం వేధింపులు భరించలేక మరికొంత మంది తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా రాష్ట్రపతికి దరఖాస్తులు పెట్టుకొన్నారు. బిల్లులు మంజూరు చేయడం లేదని.. తమకు చావు తప్ప మరో దిక్కు లేదని.. కారుణ్య మరణం ప్రసాదించాలంటూ వారు మొరపెట్టుకోవడం బీజేపీ ప్రభుత్వంలో అవినీతి పరాకాష్టకు నిదర్శనంగా నిలుస్తున్నది.

మంత్రే వెల్లడించిన అవినీతి బాగోతం
బీజేపీ అవినీతి బాగోతాన్ని సాక్ష్యాత్తూ ప్రభుత్వంలోని మంత్రే బహిరంగంగా వెల్లడించారు. అక్టోబర్‌లో సస్పెన్షన్‌కు గురై గుండెపోటుతో మృతిచెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌ఎన్‌ నందీశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా మంత్రి ఎంటీబీ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌కు రూ.70-80 లక్షల లంచం ఇస్తే గుండెపోటు రాకుండా ఇంకేమవుతుంది’ అని వ్యాఖ్యానించిన వీడియో వైరల్‌ అయింది. బెళగావి జిల్లాలో బీజేపీ నేత, పోలీసు అధికారుల వేధింపులు తాళలేక 28 ఏండ్ల యువకుడు గత సెప్టెంబర్‌లో తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయాడు. పీడీఎస్‌ వ్యవస్థలో చోటుచేసుకొంటున్న అవినీతికి భరించలేక రాజ్యోత్సవ అవార్డు గ్రహీత అయిన వీరాచారి అనే ఓ పర్యావరణవేత్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Latest News

More Articles