Sunday, May 19, 2024

ఎండాకాలం కుక్కలతో జర జాగ్రత్త.. కుక్క కరిచిన వెంటనే ఇలా చేయండి

spot_img

ఎండాకాలం వస్తే అంతా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై తిరిగే కుక్కలే కాదు, ఇంట్లోని పెంపుడు కుక్కలు కూడా ఒక్కోసారి అకారణంగా కరుస్తూ ఉంటాయి. కుక్కలు అకస్మాత్తుగా మనుషుల మీద దాడి చేసే సంఘటనలు వేసవిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో కుక్కలు ఇలా విపరీతంగా ప్రవర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక తీవ్ర కోపానికి, ఉద్రేకానికి గురవుతాయి. వాటి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, రోగనిరోధక వ్యవస్థ పై కూడా ప్రభావం పడడం వల్ల వీటి స్వభావం మారిపోతుంది.

ఎండలోనుంచి వచ్చిన వ్యక్తి ఎంతగా చికాకు పడతాడో.. అవి కూడా అంతే కోపంగా, చికాకుగా ఉంటాయి.దీంతో అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఆహారం, నీళ్లు అందక మరింత ఉద్రేకంగా ఉంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు గురైన కుక్క ఎవరినైనా కరిచే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి వేసవిలో కుక్క కాటుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి.

కుక్క కరిస్తే చాలామంది తేలికగా తీసుకుంటారు. నిజానికి కుక్క కాటుకు గురైన వెంటనే టీకా తీసుకోవాలి.. లేకుంటే రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు.ఈ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు. ఇది ప్రాణాంతక పరిస్థితులకు తీసుకెళ్తుంది. కాబట్టి కుక్క కాటు కారణంగా పెద్ద గాయం అయినా లేదా చిన్న గాయమైన ఖచ్చితంగా టీకా అవసరం.

డాగ్  కరిచిన వెంటనే సబ్బుతో ఆ గాయాన్ని శుభ్రంగా కడగాలి. చాలామంది గాయాలకు పసుపు పెట్టి ఊరుకుంటారు. అక్కడ మురికి, బ్యాక్టీరియా చేరి సమస్య పెరిగిపోతుంది. కాబట్టి వెంటనే సబ్బుతో గాయాన్ని కడగాలి. ఆల్కహాల్ వంటివి పోసే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి పనులు చేయకూడదు. కుక్క కాటు వల్ల రక్తస్రావం అధికంగా ఉంటే శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టి రక్తం అధికంగా పోకుండా కాపాడుకోవాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. టెటానిస్ ఇంజక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం.

కుక్క కరిచిన తర్వాత రాబిస్ వ్యాక్సిన్ ఐదుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కరిచిన మొదటి రోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 31వరోజు… ఈ రాబిస్ వ్యాక్సిన్ ను తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ కేంద్రాలలో ఇవి అందుబాటులో ఉంటాయి. కుక్కకాటును తేలికగా మాత్రం తీసుకోవద్దు. చిన్న పంటిగాటు పడినా కూడా తగిన చికిత్స తీసుకోవడం అవసరం. కుక్క కాటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి వేసవిలో కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

ఇది కూడా చదవండి:దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్‌

Latest News

More Articles