Saturday, May 11, 2024

2000 పడకల నిమ్స్ నూతన భవనానికి భూమిపూజ..!

spot_img

ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించే నూతన నిమ్స్ నిర్మాణం అందుబాటులోకి వస్తే, 1500 గా ఉన్న పడకల సంఖ్య మొత్తం 3500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తయితే తద్వారా మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, ఒక్క నిమ్స్ లోనే మొత్తం 3700 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా నిమ్స్ సేవలు మరింత విస్తృతం అవుతాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణలో నెలకొని ఉన్నట్లు అవుతుందన్నారు మంత్రి హరీష్ రావు.

Latest News

More Articles