Saturday, May 18, 2024

ఖమ్మంలో బీజేపీ సభ రద్దు.. ఆగ్రహంగా అమిత్ షా.. తల పట్టుకున్న నేతలు

spot_img

ఖమ్మంలో సభపెట్టి హడావుడి చేద్దామనుకున్న బీజేపీకి సీన్‌ రివర్స్‌ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి ఏకంగా తన సభను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి అమిత్‌ షా వచ్చి తెలంగాణలో ప్రళయం సృష్టిస్తారనే స్థాయిలో బీజేపీ ప్రచారం చేసుకొన్నది. కానీ సభకు ఒకరోజు ముందే ఆయన పీఛేముడ్‌ అనడంతో రాష్ట్ర నేతలకు దిక్కు తోచడం లేదు. ఈ దుస్థితికి అనేక కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ఇన్నాళ్లూ కనిపించిన హైప్‌ అంతా వాపు మాత్రమే అని తేలిపోవడం, ఎంత బతిమిలాడినా ఒక్క రాజకీయ నేత కూడా బీజేపీలో చేరకపోవడం వంటి వాటితో అమిత్‌షా పర్యటన రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు.

ఎవరికివారే యమునాతీరే..
రాష్ట్ర బీజేపీలో బండి వర్గం, ఈటల వర్గం, ఇద్దరూ పడని మూడో వర్గం, సైలెంట్‌గా ఉన్న నాలుగో వర్గం.. ఇలా ఉన్న గుప్పెడు మంది నేతలు ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా బండి వర్సెస్‌ ఈటల వర్గపోరు తారస్థాయిలో నడుస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అధ్యక్షుడిగా బండి ఫెయిల్‌ అని నిరూపించడానికి ఈటల, చేరికల కమిటీ చైర్మన్‌గా ఈటల విఫలమని ఢిల్లీ పెద్దలకు చెప్పడానికి బండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అధ్యక్ష మార్పు ఉంటుందని ఈటల వర్గం, ఈటల పార్టీని వీడుతారని బండి వర్గం లీకులిస్తూ, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఎన్నడూలేని అంతర్గత కుమ్ములాటల అధిష్ఠానానికి ఆశ్చర్యం కలిగించినట్టు శ్రేణులు అంటున్నాయి.

నేతల తీరు చూసి బీజేపీలో చేరికలు బందయ్యి చాలా రోజులయ్యింది. మునుగోడు ఎన్నికల సమయంలో ఒకరిద్దరు చేరినట్టు కనిపించినా.. నలుగురు బయటికి వెళ్లిపోయారు. బీజేపీలో చేరితే బందీఖానాలో పడ్డట్టే అని, స్వేచ్ఛకు సంకెళ్లు పడతాయని అన్ని పార్టీల నేతలకు తెలిసొచ్చిందని అంటున్నారు. వాస్తవానికి బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లిని ఖమ్మం సభలో బీజేపీలో చేర్చుకోవాలని, ఢిల్లీలో మార్కులు కొట్టేయాలని బండి, ఈటల కలలుగన్నట్టు సమాచారం. వారు చేరుతామని హామీ ఇవ్వకపోయినా, అమిత్‌ షా ముందు బిల్డప్‌ ఇచ్చి సభ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. అయితే పొంగులేటి, జూపల్లి చేరడం లేదని అమిత్‌షాకు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం బీజేపీకి అత్యంత బలహీన ప్రాంతం. అక్కడ కనీసం గ్రామ స్థాయి నేతలు కూడా సరిగా లేరు. అలాంటిచోట లక్ష మందితో సభ అంటూ ఊదరగొట్టడం పెద్ద తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బండి సంజయ్‌, ఇతర నేతలు రోజుల తరబడి ఖమ్మంలో తిష్టవేసి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్పందన రాలేదని అంటున్నారు. రాజమౌళి కలుస్తారని, ప్రభాస్‌ వస్తాడని.. ఇలా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఖమ్మంలో పారలేదు. సీఎం కేసీఆర్‌ జిల్లాల్లో నిర్వహించే సభలకు ప్రజలు పోటెత్తుతున్న ప్రస్తుత సమయంలో తాను ఖాళీ సభకు హాజరైతే దేశవ్యాప్తంగా పరువు పోతుందని అమిత్‌ షా వెనుకడుగు వేసినట్టు విశ్లేషిస్తున్నారు.

Latest News

More Articles