Friday, May 17, 2024

ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమించిన ఉన్నత విద్య మండలి

spot_img

2023 అకాడమిక్ ఇయర్ కోసం జరగనున్న ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను ప్రకటించింది. ఎడ్‌సెట్‌ మినహా అన్ని ఎంట్రన్స్‌లకు కొత్త కన్వీనర్లు వచ్చారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న విశ్వవిద్యాలయాలను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌, ఫార్మా కోర్సుల కోసం నిర్వహించే ఎంసెట్‌ బాధ్యతలను ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హెచ్‌కు అప్పగించింది. కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ బి. డీన్‌ కుమార్‌ని ఉన్నత విద్యామండలి నియమించింది.

పీజీఈసెట్‌ కొత్త కన్వీనర్‌గా JNTUH  మ్యాథ్స్ విభాగం ప్రొఫెసర్‌ బి.రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్‌ ఈఏడాది కాకతీయ యూనివర్సిటీనే నిర్వహించనుంది. కన్వీనర్‌గా కేయూ కామర్స్‌ విభాగం ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి వ్యవహరించనున్నారు. ఈసెట్‌ కొత్త కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ నియమితులయ్యారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ను ఈ ఏడాది కూడా ఓయూ నిర్వహించనుండగా.. కొత్త కన్వీనర్‌గా ఓయూ లా  కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ బి.విజయలక్ష్మి వ్యవహరించనున్నారు. బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ ఎ. రామకృష్ణ ఈ ఏడాది కూడా కొనసాగనున్నారు. వ్యాయామ కోర్సుల ప్రవేశాల కోసం పీఈసెట్‌ను శాతవాహన విశ్వవిద్యాలయానికి అప్పగించారు. పీఈసెట్‌ కొత్త కన్వీనర్‌గా  ఓయూ ఫిజికల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌కుమార్‌ నియమితులయ్యారు. మే, జూన్‌ నెలలో ప్రవేశ పరీక్షలన్నీ నిర్వహించాలని భావిస్తున్న ఉన్నత విద్యా మండలి.. త్వరలో తేదీలను ప్రకటించనుంది.

Latest News

More Articles