Friday, May 3, 2024

ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ అధినేత..రైతులను కలవనున్న గులాబీ బాస్.!

spot_img

లోకసభ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ టూర్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరెంటు కోతలు, సాగునీటి దుర్భిక్ష పరిస్ధితులపై రైతులతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రజలకు వెళ్తున్న తొలి పర్యటన కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం నెలకొంది. సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసి, మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.

ఇవాళ నేరుగా రైతుల వద్దకు వెళ్లి, రైతాంగానికి కష్టకాలంలో అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు కేసీఆర్. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, సాగు నీరం దక చేతికొచ్చిన పంట ఎండిపోతున్న తీరును ఆయన నేరుగా పరిశీలించి రైతులు బాధలు తెలుసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ప్రతిపక్ష నేతగా తొలి క్షేత్రస్థాయి పర్యటన సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలిస్తారు కేసీఆర్. ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో వెళ్తారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుని… అక్కడ ఎండిపోయిన పంటపొలాలను పరిశీలిస్తారు. 11:00 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు గులాబీబాస్.

మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరుతారు. 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుని.. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం 3 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి.. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫాంహౌసు చేరుకుంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తుండటం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

ఇది కూడా చదవండి: ఫాస్ట్ ట్యాగ్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు…ఏప్రిల్ 1ను ఈ మార్పులు జరగబోతున్నాయ్.!

Latest News

More Articles