Saturday, May 4, 2024

నేతన్నలపై కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కారు

spot_img

బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా కళకళలాడిన చేనేతరంగం.. మీ కాంగ్రెస్ రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేనేతల ఆత్మహత్యలను అరికట్టడంతో పాటు వారిని ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్. 2004 నుంచి 2014 వరకు  కాంగ్రెస్ హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చి నాగులునెలలు గడవకముందే అదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అవడంతోపాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతోపాటు కార్మికులు రోడ్డునపడటంతో.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడం వల్ల  వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నా మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం.. ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలతో.. ఏదో ఒక రూపంలో తమ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ మీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం.. వారి మనోస్థయిర్యాన్ని మరింత దెబ్బతీస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించాడు.  ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారు. నేతన్నలపైనా కాంగ్రెస్ కున్న చిన్న చూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది.

కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన మీకు ఒక్క సారి గతం గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా ఇవే పరిస్థితులు సమైక్యరాష్ట్రంలో నెలకొని ఉండేవి. తెలంగాణ సాధించాక పాలనా పగ్గాలు చేపట్టిన కేసిఆర్ గారు తెలంగాణలో నేతన్నలను, వస్త్ర పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. చిక్కిశల్యమైన ఈ పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ గారు సమీక్ష నిర్వహించారు. నేతన్నల వేతనాలను, కూలీలను రెట్టింపు అయ్యేలా, ప్రతి కార్మికుడు నెలకు 15 నుంచి 20 వేలు సంపాదించుకుని గౌరవప్రదంగా జీవించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. చేనేత మిత్రా, నేతన్నకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రారంభించాము. వీటి కోసం భారీ ఎత్తున గత 60 ఏండ్లలో ఎప్పుడు లేనంత బడ్జెట్ కేటాయించాము.

గతంలో ఇతర రాష్ర్టాలనుంచి సరఫరా అయ్యే, రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లును రాష్ర్టంలోని నేతన్నలకు ఇచ్చి, చేతి నిండా పని కల్పించింది నాటి ప్రభుత్వం. దీంతో అప్పటిదాకా ఉపాధి లేక అల్లాడిన కార్మికులకు పని లభించింది. సంప్రదాయంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తూనే పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం తోడ్పాటునందించింది. మగ్గాల అధునీకీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి అల్ రౌండ్ అప్రోచ్ తో ముందుకు సాగింది. వీటన్నింటి వలన కార్మికులకు ఉరట లభించడంతో, వీరికి మరింత పని కల్పించడంతోపాటు, కడుపునిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన బతుకమ్మ చీరల పథకం ప్రారంభించింది. బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా అందించడంతో.. కార్మికులకు చేతి నిండా పని దొరికింది. దీంతోపాటు.. రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింత ఉపాధి పెరిగింది. ఇలా ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల వరకూ వరుస ఆర్డర్లు అందడంతో.. సాంచాల పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసింది. పవర్ లూమ్ లను ఆధునీకరించుకునేందుకు సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడంతో వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్టయింది.

నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఆ మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో  వస్త్రపరిశ్రమ విస్తరించి ఉన్న  వివిధ ప్రాంతాలతోపాటు.. కాంగ్రెస్ తోపాటు గత ప్రభుత్వాల పాలనలో ఒకప్పుడు ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనింది. వీటికి తోడు నేతన్నకుభీమా అమలుచేయడంతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించింది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కార్మికలోకంలో కొనుగోలు శక్తి కూడా పెరిగింది.. ఓవైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు సమగ్ర అభివృద్ధితో వారి జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. పవర్ లూమ్ కార్మికులు అధికంగా ఉండే… కరీంనగర్, సిరిసిల్లతోపాటు.. వరంగల్, ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు కూడా బీఆర్ఎస్ హయాంలో కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడంతో.. వస్త్ర పరిశ్రమకున్న అన్ని సమస్యలు తొలగిపోయాయి.

తెలంగాణ సాధించిన క్షణం నుంచి పదేళ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్లీ కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి.. పరిశ్రమను దెబ్బతీయడంతోపాటు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న మీ కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడాది బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి జీవో ను ఫిబ్రవరి నెలలోనే విడుదల చేసేది. కానీ మార్చి నెల మొదలైనా కాంగ్రెస్ సర్కారు వైపు నుంచి కదలిక లేకపోవడంతో వీటిపై ఆధారపడిన వారందరిలో ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోంది.  ఇది 35 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్య కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వెంటనే నేతన్నలకు ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి. అలాగే యార్న్‌ సబ్సిడీ ని కూడా వెంటనే విడుదల చేయాలి. మాప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెలకు కార్మికుల ఖాతాల్లో నేరుగా సూమారు 3000 రూపాయాల వరకు పడేవి. ఈ ప్రభుత్వం వచ్చాకా చేనేత మిత్రా కార్యక్రమం అగిపోయింది. మూలన పడిన సాంచాలను తిరిగి తెరిపించడానికి.. పరిశ్రమకు రావాల్సిన రూ.270 కోట్లు బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మరోవైపు సొంత రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమిషన్లకు కక్కుర్తి పడి.. తమిళనాడుకు, సూరత్ కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

రైతాంగ సంక్షోభాన్ని చూసినట్టు నేతన్నల సంక్షోభాన్ని కూడా రాజకీయ కోణంలో కాకుండా.. పేద బడుగు, బలహీన వర్గాలైన నేతన్నల కోణంలో ఆలోచించి వెంటనే పరిష్కరించాలని రాష్ట్రంలోని నేత కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పటికే పులువురు కార్మికులు ఆత్మహత్యకు కూడా పాల్పడిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాల అమలు కొనసాగించాలి. అవసరం అయితే మరింత అధనపు సాయం అందేలా చూడాలి కానీ కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో వేల మంది నేతన్నల పొట్ట కొట్టవద్దని కోరుతున్నాను.  లేకపోతే.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిశ్రమపై ఆధారపడిన వేల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, మరింత సంక్షోభంలో కూరుపోతారని అవేదనతో తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వేంటనే ఈ అంశంపైన వేగంగా స్పందిచి, నేతన్నలకు అదుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ తరపున కొరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ర్టంలోని బడుగు,బలహీన వర్గాల నేతన్నలు తమ పొట్టకొడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు అంటూ లేఖలో తెలిపారు కేటీఆర్.

ఇది  కూడా చదవండి: నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్‌కు అంగీకరించను

Latest News

More Articles