Monday, May 6, 2024

ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

spot_img

ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాదంలో గాయపడి ఎంఎన్‌ఆర్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను హరీశ్‌ రావు పరామర్శించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చికిత్స పొందుతున్న వాళ్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు.

గాయపడినవారు ఎంత మంది ఉన్నారో కంపెనీ యాజమాన్యం చెప్పడం లేదన్నారు. కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. గాయపడినవారికి రూ.25 లక్షల చొప్పున సహాయం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. ప్రమాద ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున సహాయం చేస్తామన్నారు. కాగా, కంపెనీలో బాయిలర్‌ పేలి ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: నేతన్నలపై కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కారు

Latest News

More Articles