Sunday, May 19, 2024

పేదల ఆకలి పట్టించుకోని కేంద్రం.. బియ్యం ఇచ్చేదిలేదని తెగేసి చెప్పిన కేంద్రమంత్రి

spot_img

కార్పొరేట్ల కనుసన్నల్లో మెలుగుతూ, పేదల ద్వేషిగా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కోట్లమంది పౌరులు ఆకలితో అలమటించేలా చేసే ప్రమాదకర నిర్ణయం తీసుకొన్నది. ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమన్న ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తున్నది. పేదలకు పంపిణీ చేసేందుకు బియ్యం కావాలని, ఎంత ధర అయినా ఇచ్చి కొంటామని రాష్ర్టాలు బతిమాలినా గింజ కూడా ఇచ్చేది లేదని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తేల్చి చెప్పారు. అదే సమయంలో అడ్డికి పావుశేరుకాడికి ఇథనాల్‌ కంపెనీలకు నిరాటంకంగా లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా సరఫరా చేస్తూనే ఉన్నారు.

పేదల ఆకలికంటే పెద్దల వ్యాపారమే ముఖ్యమట
పేదలకు పంపిణీ చేసేందుకు బియ్యం కావాలని అడిగితే నిరాకరిస్తున్న కేంద్రం, ఇథనాల్‌ కంపెనీలకు మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తూనే ఉన్నది. క్వింటాలుకు రూ.3,400 అయినా ఇస్తామని, తమకు బియ్యం సరఫరా చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. ‘ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ర్టాలు బియ్యం కావాలని అడిగాయి. కానీ ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీం (ఓఎంఎస్‌ఎస్‌) కింద కేంద్రం వద్ద ఉన్న బియ్యం నిల్వల నుంచి రాష్ర్టాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించేది లేదు. వారికి అవసరమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు’ అని పీయూష్‌గోయల్‌ ఉచిత సలహా ఇచ్చారు. దేశంలో బియ్యానికి డిమాండ్‌ భారీగా ఉన్నదని, తమ వద్ద ఉన్న బియ్యం రాష్ర్టాలకు ఇచ్చేస్తే కేంద్రం వద్ద నిల్వలు తగ్గిపోతాయని చెప్పుకొచ్చారు. ఇథనాల్‌ కంపెనీలకు మాత్రం ఎఫ్‌సీఐ ద్వారా క్వింటాల్‌కు రూ.2,000 కే కేంద్రం ఏకంగా 1.5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. అంటే పేదలకు క్వింటాల్‌కు రూ.3,400 కూడా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కేంద్రం, ఇథనాల్‌ తయారుచేసే కంపెనీలకు మాత్రం అందుకు రూ.1,400 తక్కువకే సరఫరా చేస్తుండటం గమనార్హం.

అడ్డదిడ్డ నిర్ణయాలు
కేంద్ర ప్రభుత్వ ముందుచూపు లేని విధానాలతో దేశంలో బియ్యానికి కొరత ఏర్పడింది. వరి అధికంగా పండించే తెలంగాణ వంటి రాష్ర్టాలపై కేంద్రం పగబట్టి వేధింపులకు పాల్పడుతుండటంతో ఈ పరిస్థితి దాపురించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం -2013 ప్రకారం దేశంలోని దాదాపు 81 కోట్లమంది పేదలకు కేంద్రం ప్రతినెలా సబ్సిడీ ధరకు బియ్యం, గోధుమలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా 6 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు అవసరం అవుతున్నాయి. పీడీఎస్‌ కోసం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ర్టాల నుంచి బియ్యం, గోధుమలను కేంద్రం సేకరించి నిల్వ చేస్తున్నది. వాటినే రాష్ర్టాల ద్వారా మళ్లీ ప్రజలకు అందిస్తున్నది.

కేంద్రానికి అదనంగా రాష్ర్టాలు కూడా పేదలకు బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తుండటంతో వాటికి కూడా అవసరం ఏర్పడుతున్నది. కాగా, 2014కు ముందు కేంద్రం అవసరానికి మించి బియ్యం, గోధుమలను సేకరించి నిల్వ చేసేది. బహిరంగ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఓఎంఎస్‌ఎస్‌ ద్వారా అవసరాన్ని బట్టి ఆ నిల్వలను విడుదల చేసేంది. రాష్ర్టాలు కూడా ఓఎంఎస్‌ఎస్‌ ద్వారానే కొనుగోలు చేసేవి. మోదీ సర్కారు వచ్చిన తర్వాత సబ్సిడీ పథకాలకు మంగళం పాడే చర్యలు మొదలుపెట్టింది. పీడీఎస్‌ను కూడా క్రమంగా వదిలించుకొనేందుకు సిద్ధమైంది. ఎఫ్‌సీఐ ద్వారా ఏటా సేకరించే బియ్యం, గోధుమల మొత్తాన్ని భారీగా తగ్గించింది. దీంతో సెంట్రల్‌ పూల్‌లో వీటి నిల్వలు 8 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ నెల 1 నాటికి సెంట్రల్‌ పూల్‌లో 41.4 మిలియన్‌ టన్నుల బియ్యం, 31.4 మిలియన్‌ టన్నుల గోధుమలు మాత్రమే మిగిలాయి. ఇది 2016 నాటికంటే తక్కువ.

డబుల్‌ ధర ఇస్తామన్నా ససేమిరా
నిజానికి మంచి ధర వస్తుందంటే ఏ విక్రయదారు అయినా కండ్లుమూసుకొని తన వస్తువును అమ్మేసుకొంటాడు. ఇప్పుడు బియ్యం కోసం రాష్ర్టాలు కూడా భారీ ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. క్వింటాల్‌కు రూ.3,400 ఇస్తామని కర్ణాటక ఆఫర్‌ చేసింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం తనవద్ద అవసరానికి మించి ఉన్న నిల్వలను మంచి ధర వస్తుంది కాబట్టి రాష్ర్టాలకు ఇవ్వవచ్చు. కానీ, మోదీ సర్కారు అందుకు భిన్నంగా స్పందించింది. అందుకోసం కేంద్రం చెప్పిన కారణం కూడా నమ్మశక్యంగా లేదు. కొరత ఉన్నందుకే రాష్ర్టాలకు ఇవ్వటం లేదని పీయూష్‌గోయల్‌ తెలిపారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు కూడా విధించామని చెప్పారు. మరి అంత కొరత ఉన్నప్పుడు ఇథనాల్‌ కంపెనీలకు క్వింటాల్‌కు రూ.2 వేలకే ఎలా సరఫరా చేస్తున్నారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

దారితప్పిన ఇథనాల్‌ రోడ్‌మ్యాప్‌
శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించేందుకు మోదీ సర్కారు ‘రోడ్‌మ్యాప్‌ ఫర్‌ ఇథనాల్‌ బ్లెండింగ్‌ ఇన్‌ ఇండియా 2020-25’ని తీసుకొచ్చింది. ఈ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్‌ తయారుచేసింది. 2025-26 నాటికి దేశంలో విక్రయించే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలుపాలని ఈ డాక్యుమెంట్‌ నిర్దేశించింది. ఇది సాధించాలంటే కంపెనీలు ఏటా 10.16 లక్షలకోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలి. ఇథనాల్‌ తయారీలో బియ్యం, చెరకు, మొక్కజొన్నే కీలకం. అందులోనూ బియ్యమే అతి ముఖ్యమైన ముడిసరుకు. మొత్తం ఉత్పత్తి లక్ష్యంలో 45 శాతం ఇథనాల్‌ను బియ్యం ద్వారానే ఉత్పత్తి చేస్తారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కంపెనీలకు ఎఫ్‌సీఐ ద్వారా క్వింటాల్‌ రూ.2 వేలకే బియ్యం సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రేటుకే 2021-22లో 1.06 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ సంవత్సరం 1.5 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉన్నది. ఈ నిర్ణయమే ఇప్పుడు ప్రజల ఆకలి కేకలకు కారణమయ్యేలా ఉన్నది. కేంద్రంపై పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Latest News

More Articles