Monday, May 20, 2024

జార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం.. బల నిరూపణకు 10 రోజుల గడువిచ్చిన గవర్నర్

spot_img

జార్ఖండ్‌‎ నూతన సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. చంపైతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్‌ సోరేన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత కొత్త సీఎంగా చంపై సొరేన్‌ ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత మాట్లాడుతూ.. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ఆయన దీమా వ్యక్తం చేశారు.

చంపై సోరెన్‌ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. చంపై 1974లో జంషెడ్‌పూర్లోని రామకృష్ణ మిషన్‌ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. బీహార్ నుంచి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చిన సమయంలో చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార్ఖండ్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పిలుస్తూ వస్తున్నారు.

చంపై తొలిసారిగా 2005లో జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెప్టెంబర్ 2010 నుంచి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్ హౌసింగ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జూలై 2013 నుంచి డిసెంబర్ 2014 పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో మూడోసారి జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు.

Latest News

More Articles