Saturday, May 18, 2024

హ్యాట్రిక్ గెలుపు ఖాయం.. అధికారం మనదే  

spot_img

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్‌లు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘వజ్రతునక తెలంగాణ. స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంలో జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందాం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిమీదా ఉన్నదని సీఎం తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు ఇలా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు వచ్చిన ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అనతికాలంలోనే తెలంగాణ దేశానికి ఎలా రోల్ మోడల్ అయిందో ఆయన తనదైన శైలిలో ఆవిష్కరించారు.

‘రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. మనం కచ్చితంగా 95 ఉంచి 105 స్థానాలు గెలబోతున్నాం. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు అందరూ పనిచేస్తే కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ 50వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

పదేండ్ల కాలంలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం కాబట్టే ఇవ్వాళ తెలంగాణ మోడల్ ను దేశం కోరుకుంటుంది అని సీఎం తెలిపారు. సూర్యాపేటలో, కామారెడ్డిలో లేదా మరో తెలంగాణ ప్రాంతంలో సభలు పెట్టుకుంటే వేలాది మంది మనప్రజలు రావడం సహజం కానీ, మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి బలమైన కారణం మనం ఆచరించి చూపిన మాడల్. దీన్నిమనం బాగా చెప్పుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు పలు సూచలు చేశారు. వాటిల్లో ముఖ్యాంశాలు ఇవీ..

* దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలి.

* మహారాష్ట్ర తెలంగాణను చూసి ఆశ్చర్యపడుతున్నది.

* ఔరంగాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసరే తెలంగాణ మాడలే శరణ్యమని బహిరంగ ప్రకటన చేసిండు.

* మనం మనం చేసిన పనులను చెప్పుకోవటంలేదు.

* దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు సహ అన్ని స్థాయిల ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలె.

* రైతు వేదికలు అపూర్వమైన వేదికలు. వాటి గొప్పతనాన్ని చాటిచెప్పాలె.

* దేశంలో ఏ రాష్ట్రంలోలేనన్ని గురుకులాలను ఏర్పాటు చేసుకున్నాం. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రెసిడెన్షియల్ కాలేజీకోసం వందలసార్లు తిరిగినా కాలేజీ రాకపోయేది. ఇప్పుడు అలాంటిది దేశంలో ఎక్కడాలేనివిధంగా 1001 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇది  మన ఘనత. దీన్ని చెప్పుకోవాలి కదా.

* ఎమ్మెల్యేలు పిల్లల కోడి లెక్క ఉండాలె. అందరినీ కాపాడుకోవాలి.

* కులం…మతం  మీద ఏ పార్టీ గెల్వదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నాం. అదే మన విజయ రసహ్యం.

* ఇస్యూబేస్డ్గా పోవాలె కానీ. చిల్లరమల్లర విషయాలమీద కాదు. అంశాల వారీగా రాజకీయాలు చేయాలి. కుత్సిత మనసుతో రాజకీయాలు చేయకూడదు.

* ఉద్యమ సమయంలోనే చెప్పిన తెలంగాణ ధనిక అవుతుందని. నూటికి నూరుపాళ్లు ధనికరాష్ట్రంగా అవతరించినం.

*  రాష్ట్రంలో 3400 గిరిజన తండాలు, గోండుగూడెలాను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఇది చరిత్ర. వెయ్యి గొంతుకలతో మనం చేసిన పనిని చెప్పుకోవాలి.

* మాగ్జిమం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు.

* మనం కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం. ఇందులో ఎవరికీ అనుమానాలు, అపోహలు అక్కరలేదు.

*  నేను చెప్పినట్టు చేస్తే 50వేల మెజారిటీ గ్యారెంటీ.

* ప్రజలను మంచిగ చూసుకోవాలె.

* మన శక్తిని ఏకీకృతం చేసుకోవాలె. ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, రాష్ట్ర స్థాయి  కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అందరితో ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలె. ప్రతీది కీన్గా వాచ్ చేస్తున్నా.

* దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవాలె.

* తెలంగాణ వజ్రపు తునక.

* ఇవ్వాళ ఏపీ పరిస్థితి ఏంది? తెలంగాణలో ఇప్పటికే 56 లక్షల 44వేల ఎకరాల నాట్లు పడ్డాయి.

* మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు అద్భుతంగా పెరిగాయి. భూగర్భ జలాలు పైకి రావటానికి మనం ఏమైనా మంత్రం వేసినమా? మిషన్ కాకతీయ అనే మంత్రం అద్భుతంగా పనిచేసింది.

* గొలుసుకట్టు చెరువులను బాగు చేసుకున్నాం. ఒక్కో గొలుసుకట్టు చెరువు 27  28 చెరువుల కింద రైతులకు బువ్వపెట్టింది.

* మిషన్ కాకతీయ లేనప్పుడు భూగర్భ జలం నిలువ ఎంత? ఇప్పుడెంతా వచ్చిందో అర్ధం అయ్యేలా వివరంగా చెప్పాలి.

* రాష్ట్రంలోని 30 లక్షల బోర్లకు కొదవలేని నీరుంది.

* ఊరూరా చెరువుల పండుగ చేయాలె.

* నడి ఎండాకాలంలో చెరువులు, చెక్డ్యాములు మత్తడి దుంకుతున్నయ్.

* రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం కోరినా పెట్టలేదు. మనకు రూ. 25వేల కోట్ల నష్టం వచ్చినా రైతుల కోసం మనం నిలబడాలి అనుకున్నం. వద్దంటే వద్దని పెట్టుకోలే. అది రైతుల పట్ల మనకు ఉన్న కమిట్మెంట్.  ఈ విషయాన్ని మనం చెప్పుకోవటంలేదు.

* తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలె. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉండాలె.

* సింగరేణి తెలంగాణ కొంగుబంగారం. పదేండ్లకింద రూ. 12వేల టర్నోవర ఉంటే ఇప్పుడు రూ. 33 నుంచి 34వేల కోట్లకు చేరింది. ఈ విజయాన్ని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు చెప్పాలె.

* సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటం. అంటే మోదీ ఇస్తలేడు.

* సమాక్యపాలకుల తెలివి తక్కువ తనంతో సింగరేణికి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

* 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మైనింగ్ ద్వారా కేవలం రూ. 36 కోట్లు వస్తే మన ప్రభుత్వం కేవలం 5 ఏండ్ల కాలంలోనే రూ. 5600 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఘనతను చెప్పుకోవాలి.

* దేశంలో గుణాత్మక మార్పు రావాలె. అందుకోసమే మనం బయలుదేరినం. నెహ్రూ జమానాలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి కొంతలో కొంత చేసిండు. ఆ తరువాత ఎవరూ ప్రణాళికా బద్దంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆశించలేదు.

* గుజరాత్ మాడల్ బోగస్. మోదీ భారతదేశాన్ని మోసం చేసిండు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మాడల్ అనివార్యమని ఇతర రాష్ట్రాల వాళ్లు చెప్తున్నరు. ఈ ఘనత మనందరిదీ.

* మన బాస్లు తెలంగాణ ప్రజలే. వాళ్లే మనకు భగద్గీత. వేదం అన్నీ తెలంగాణ ప్రజలే.

* రైతు వేదికలను సరియైన పద్ధతిలో వినియోగించుకోవాలె. రైతులను పిలిచి భోజనాలు పెట్టాలె. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు ఇలా అందరూ రైతు వేదికల దగ్గరికి వెళ్లాలి. రైతులతో చర్చించాలి.

* దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని మనం చేసినం. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకున్నం. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం  పట్టించుకోకపోయినా మనం కేంద్రం కోసం ఆగలేదు.  రెండు మూడు వేల కోట్ల  భారమైనా రైతులను ఆదుకుంటామని ప్రకటించాం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 10వేలు ఇస్తామని చెప్పినం. ఇస్తున్నం. ఇది చరిత్ర. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని పని. దీన్ని మనం చెప్పుకోవాలి.

*  వడగండ్లవాన, అకాల వర్షాల నుంచి రైతులను శాశ్వతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం రైతులను చైతన్యవంతం చేసే బాధ్యత అందరం తీసుకోవాలి. సీజన్ అడ్వాన్స్మెంట్ చేయాలి. దీనిపై విస్తృతంగా రైతుల్లో అవగాహన కల్పించాలి. మార్చి 31 లోపల వరికోతలు పూర్తి కావాలి.

* చాలా మందికి తెలియని విషయం ఏమంటే మార్చి 31లోపల కోత కోసిన వరి పైరుకు నూక రాదు.

* కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్ ఉన్నదనే విషయం చాలా స్పష్టంగా తెలియజేయాలి.  కల్తీలకు పాల్పడితే  పీడీ యాక్ట్లు పెడుతున్నాం. రైతులను మోసం చేసిన వారిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు అన్న సంకేతాలు చాలా బలంగా వెళ్లాలి.

* దశాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలె. బ్యానర్లు, పోస్టర్లు కట్టాలె.

* కనివినీ ఎరుగని రీతిలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలె. అందుబాటులో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాల్లో మన చరిత్ర.. విజయగాథలను డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించాలి. వ్యవసాయం, విద్య, వైద్యం, ఇలా అన్ని రంగాల్లో మనం సాధించిన ప్రగతిని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించాలె.

* నియోజకవర్గాల వారీగా మన ప్రగతిని డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలి.

* నియోజకవర్గాల వారీగా అభివృద్ధి లేక్కలు తీయండి.

* ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న సేవలను విరివిగా వాడుకోవాలి. మంచి మంచి కార్యక్రమాలను పెట్టి వీరిని ఆహ్వానించండి.

* పారదర్శకంగా, అవినీతి రహితంగా జరుగుతున్న పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

* తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకోవాలి.

* రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆద్యుడు పీవీ. ఒక్క పీవీనే కాదు ఆయన గురువు అయిన నూకల రాంచంద్రారెడ్డి  గురించికూడా చెప్పుకోవాలి.

* దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ప్రాంతంలో ఉన్న వైతాళికులను గుర్తించాలి. గౌరవించాలి. భాగ్యరెడ్డివర్మ, బద్దంఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవీ, సురవరం ప్రతాపరెడ్డి ఇలా ఎక్కడిక్కడి వైతాళికులను గుర్తించి వారిని కీర్తించాలి. ఇట్లాంటి వాళ్లంతా తెలంగాణ ప్రతీకలు.

* సంప్రదాయ కళాకారులతో ఊరేగింపు నిర్వహించాలె.

* కవి సమ్మేళనాలు నిర్వహించాలి.  వీటికి ఎమ్మెల్యేలు నాయకత్వం వహించాలి.

Latest News

More Articles