Saturday, May 18, 2024

టికెట్ల కేటాయింపు కాకముందే కాంగ్రెస్‎లో కుమ్ములాటలు

spot_img

కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఖరారుకు ముందే సిగపట్లు మొదలయ్యాయి. దరఖాస్తుల పరిశీలన సమయంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన కోసం మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీ రచ్చ రచ్చ అయింది. సీనియర్‌ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తున్నది. మరీ ముఖ్యంగా రేవంత్‌, ఉత్తమ్‌కుమార్‌‎లు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నట్టు సమాచారం.

ఒకే కుటుంబానికి రెండు టికెట్లపై వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగినట్టు తెలిసింది. ఉత్తమ్‌, ఆయన భార్య పద్మావతి రెండు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, దీనిపై స్పష్టత ఇవ్వాలని మహేశ్‌గౌడ్‌ కోరారు. స్పందించిన ఉత్తమ్‌.. దీనిపై ఇప్పుడు చర్చ ఎందుకని, ఎవరిని టార్గెట్‌ చేస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జోక్యం చేసుకున్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని హైకమాండ్‌ చూసుకుంటుందని పేర్కొన్నారు. రేవంత్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్‌.. పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని, హైకమాండ్‌కు సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు. కల్పించుకున్న రేవంత్‌ టికెట్ల విషయంలో తనను డిక్టేట్‌ చేయొద్దని ఉత్తమ్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనపై సీనియర్‌ నేత బలరాంనాయక్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టికెట్లను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ నేత వీహెచ్‌ కూడా తన వాదన బలంగానే వినిపించారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారు? ఎక్కడ ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి కోరారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ తనను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి కూడా ఫైరయ్యారు.మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది.

Latest News

More Articles