Friday, May 17, 2024

రైతులకు కేసీఆర్ భరోసా.. తడిసిన ధాన్యం కూడా కొంటాం

spot_img

అకాల వర్షాలతో అన్నదాత ఆగమాగం అవుతుంటే.. కేసీఆర్ చూడలేకపోతున్నారు. అందుకే అన్నదాతను ఆదుకోవడానికి మరోసారి ముందుకు వచ్చారు. చేతికొచ్చిన పంట కల్లాల్లో, ఐకేపీ సెంటర్లలో వర్షానికి తడిసి ముద్దయింది. దాంతో ఏంచేయాలో తెలియని స్థితిలో అన్నదాత ఆవేదన పడుతున్నాడు. అటువంటి వారందరికీ నేనున్నానంటూ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని సైతం మద్ధతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించి అన్నదాత కళ్లలో ఆనందం చూశారు. తడవని, తడిసిన ధాన్యం ఏదైనా సరే.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. వ్యవసాయాన్ని, వ్యవసాయం చేసేవారిని కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

యాసంగి వరి ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరి ధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే పూర్తయ్యేలా ఎలాంటి విధానాలు అవలంబించాలో అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పారు. అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరి కోతలను మరో మూడునాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సూచించారు.

ఎంత పంటొచ్చినా కొంటున్నాం
వ్యవసాయాభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ ఊహించని రీతిలో సత్ఫలితాలిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎన్నో రాష్ట్రాలను అధిగమిస్తూ తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారని చెప్పారు. రైతులు ఎంత పంట పండించినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలకోర్చి అయినా గింజ లేకుండా కల్లాలవద్దకే వెళ్లి సేకరిస్తున్నదని పేర్కొన్నారు. రైతుల కోసం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ‘ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేం. అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదు.

వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తూ ఇప్పటికే ఆదుకొంటున్నది. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొన్నది. ఆపతాలంలో వారి దు:ఖాన్ని, కష్టాన్ని పంచుకోవాలని మరోసారి సిద్ధమైంది. తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఒక గింజ కూడా వదిలిపెట్టకుండా ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం. రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దు’ అని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

పంట కోతలు మూడునాలుగు రోజులు ఆపండి
యాసంగి వరిధాన్యం సేకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొన్నిచోట్ల అకాల వర్షాలు కొనసాగుతుండటంతో ధాన్యం సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినా త్వరలోనే సేకరణ పూర్తిచేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ చెప్పారు. మరో మూడునాలుగు రోజులపాటు వానలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అప్పటిదాకా వరి పంటను కోయకుండా ఆపటం మంచిదని, తద్వారా ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని రైతులకు సీఎం సూచించారు.

ఇప్పుడు కురుస్తున్న వర్షాలను గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటు వ్యవసాయ శాఖను, ఇటు రైతాంగాన్ని కోరారు. మార్చి నెల తర్వాత అకాల వర్షాలు పడే అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఏప్రిల్‌, మే నెలలు వచ్చేదాకా వరి పంట నూర్పకుంటే ఎండలు ఎకువై ధాన్యంలో నూక శాతం పెరుగుతుందని చెప్పారు. అటు అకాల వర్షాల నుంచి తప్పించుకోవటం, ఇటు నూకలు కాకుండా ఉండాలంటే మార్చి నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతలు పూర్తయ్యేలా ముందుగానే నాట్లు వేసుకోవాలని రైతాంగానికి సూచించారు. ఈ దిశగా మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఎరువుల వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

మార్పులు రైతులకు తెలియచెప్పాలి
కాలానుగుణంగా వ్యవసాయంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి ఏఈవోలను, అధికారులను ఎప్పటికప్పుడు ఈ దిశగా అప్రమత్తం చేయాలని, వారు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు ఇచ్చేలా చూడాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆదేశించారు. రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయాధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. ‘తెలంగాణ వ్యవసాయం అత్యంత వేగంగా పురోగమిస్తున్నది.

ఈ వేగాన్ని అందుకొనేందుకు వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలుంటాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను, లక్ష్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని డైనమిక్‌గా పనిచేయాలి’ అని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల సుమన్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్‌, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ వీ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles